ఏసీబీ వలలో అవినీతి చేపలు..మలక్‌‌పేటలో పట్టుబడ్డ ఇద్దరు కమర్షియల్ టాక్స్‌‌ ఆఫీసర్లు

  • జూబ్లీహిల్స్​లో శానిటరీ ఫీల్డ్​అసిస్టెంట్

హైదరాబాద్‌‌, వెలుగు : మలక్‌‌పేట సర్కిల్‌‌–2 లో ఇద్దరు కమర్షియల్‌‌ టాక్స్‌‌ ఆఫీసర్లు బుధవారం ఏసీబీ వలలో చిక్కారు. ట్రాప్ వివరాలను ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఓ వ్యాపారికి చెందిన బ్యాంక్​ఖాతాను గతంలో ఫ్రీజ్ చేశారు. దీనిని డీఫ్రీజ్‌‌ చేయడానికి బాధితుడు కమర్షియల్ టాక్స్‌‌ అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన లెటర్‌‌ ఇవ్వడానికి అసిస్టెంట్‌‌ కమిషనర్‌‌‌‌ మహబూబ్‌‌ బాషా రూ. లక్ష లంచం డిమాండ్‌‌ చేశాడు. 

దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. బుధవారం బాధితుడి నుంచి అడ్వాన్స్​గా రూ. 50 వేలు తీసుకుంటుండగా, మహబూబ్‌‌ బాషాతో పాటు మరో కమర్షియల్ టాక్స్‌‌ ఆఫీసర్‌‌‌‌ సోమ శేఖర్‌‌ను ఏసీబీ అధికారులు రెడ్‌‌ హ్యాండెడ్‌‌గా పట్టుకున్నారు. వీరిద్దరిని నాంపల్లిలోని ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌‌కు తరలించారు.

జూబ్లీహిల్స్ : కాఫీ షాపు యజమాని నుంచి లంచం తీసుకుంటూ జూబ్లీహిల్స్ సర్కిల్​-18 శానిటరీ ఫీల్డ్​అసిస్టెంట్ సలీంఖాన్ ఏసీబీకి పట్టుబడ్డాడు. జరిమానా విషయంలో తనకు ఫేవర్​గా ఉండాలని షాపు నిర్వాహకుడు కోరాడు. ఇందుకు సలీంఖాన్​ రూ.60 వేలు ఇవ్వాలని అడిగాడు. దానికి షాపు నిర్వాహకుడు రూ.25 వేలు ఇస్తానని బేరం కుదుర్చుకొని ఏసీబీని ఆశ్రయించాడు. 

బుధవారం ఈ డబ్బులు ఏవో జి.రమేశ్​కు ఇస్తుండగా, ఏసీబీ అధికారులు పట్టుకున్నాడు. అనంతరం సలీంఖాన్​తోపాటు రమేశ్​ను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.