- కరీంనగర్ ఎంపీ పరిధిలో బీసీలకు రెండు సీట్లు?
- ఉదయ్ పూర్ డిక్లరేషన్ అమలుపై ఉత్కంఠ
- వేములవాడ, కరీంనగర్, హుస్నాబాద్ స్థానాలపై ఆసక్తి
కరీంనగర్, వెలుగు : కరీంనగర్ పార్లమెంట్ స్థానం పరిధిలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు కేటాయించే స్థానాలపై ఉత్కంఠ నెలకొంది. ఏఐసీసీ ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ప్రకారం ఒక్కో లోక్‌సభ స్థానం పరిధిలో రెండు సీట్లు బీసీలకు కేటాయించాలని తీర్మానించిన విషయం తెలిసిందే. కరీంనగర్ లోక్ సభ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో మానకొండూరు, చొప్పదండి ఎస్సీ రిజర్వుడ్కాగా.. మిగతా ఐదింటిలో బీసీలకు రెండు స్థానాలు దక్కే అవకాశం ఉంది. అయితే ఆ రెండు స్థానాలు ఏంటనే దానిపై ఆసక్తి నెలకొంది. సామాజిక సమీకరణలో ఎక్కడ ఎవరికి టికెట్ దక్కుతుందో.. ఎవరికి కోత పడుతుందోనన్న చర్చ జోరుగా సాగుతోంది.
మూడు నియోజకవర్గాల్లో బీసీ లీడర్లు..
కరీంనగర్ లోక్ సభ పరిధిలోని ఐదు జనరల్ స్థానాలకుగాను మూడింట్లో బీసీ లీడర్లు పోటీ పడుతున్నారు. వీటిలో వేములవాడ, కరీంనగర్, హుస్నాబాద్ నియోజకవర్గాలు ఉన్నాయి. వేములవాడ నియోజకవర్గం నుంచి నాలుగు ఎన్నికల్లో పోటీ చేసి కొద్ది తేడాతో ఓడిపోయిన ఆది శ్రీనివాస్ మరోసారి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. నాలుగు సార్లు ఓడిపోయిన సానుభూతి, ప్రభుత్వ వ్యతిరేకత తనకు కలిసి వస్తుందని, దీంతో హైకమాండ్తనకే టికెట్ఇస్తుందన్న ధీమాతో శ్రీనివాస్ ఉన్నారు. కరీంనగర్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న బీసీ లీడర్లలో ఏఐసీసీ సభ్యుడు కొనగాల మహేశ్, బొమ్మకల్ సర్పంచ్ పురుమల్ల శ్రీనివాస్ ఉన్నారు.
వీరిద్దరు మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందినవారే. కరీంనగర్ టికెట్ ను బీసీకే కేటాయించాల్సి వస్తే వీరిద్దరిలో ఒకరికి వచ్చే చాన్స్ ఉంది. అలాగే కాంగ్రెస్ లో బలమైన బీసీ నేతగా పేరుండి, గతంలో కరీంనగర్ నుంచి పోటీ చేసిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఈసారి హుస్నాబాద్ టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పటికే ప్రచారం కూడా మొదలుపెట్టారు. ఈ మూడు నియోజకవర్గాలకు చెందిన బలమైన బీసీ లీడర్లలో టికెట్ వచ్చే ఇద్దరు ఎవరనేది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది.