వాష్‌రూమ్‌లలో సీసీ కెమరాలు అమర్చి వీడియోలు చిత్రీకరించినట్లు వార్తలు రావడంతో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థినులు ఆందోళన బాట పట్టారు. నిందితుడిని కఠినంగా శిక్షించడంతో పాటు తమకు న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. అతని నుంచి ల్యాప్‌టాప్, మొబైల్ స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిలో ఉన్న డేటా, అతని కాల్ లిస్టు వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. ఇలా ఒకవైపు విచారణ జరుగుతుండగానే.. కళాశాల యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది.
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం రెండ్రోజుల పాటు సెలవులు ప్రకటించింది. విద్యార్థినులు ఆందోళన బాట పట్టడం.. వారికి మహిళా సంఘాలు మద్దతు తెలపడంతో పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించిన యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. కళాశాలకు సెలవులు ప్రకటించడంతో తల్లిదండ్రులు విద్యార్థులను ఇంటికి తీసుకెళ్తున్నారు.
సమ్మె బాట
ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న చంద్రబాబు ప్రభుత్వం న్యాయం చేస్తామని విద్యార్థినులకు హామీ ఇచ్చింది. విద్యార్థినుల ఆందోళనలపై ఆరా తీసిన విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ విచారణకు ఆదేశించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రెండ్రోజుల్లో సమస్యను పరిష్కరించకపోతే విద్యార్థినిలు సమ్మె బాట పడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.