బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న దోపిడీని, కుట్రలను తిప్పి కొట్టాలంటూ పార్టీ శ్రేణులకు బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ఇవ్వడాన్ని ఖండిస్తున్నామన్నారు. తొమ్మిదేళ్లు అధికారంలో ఉండి కూడా కూలిపోయే స్థితిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను రక్షించలేని బీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ కామెంట్స్ చేశారు.
మంత్రి కేటీఆర్ కొడుకు రూ.40 లక్షల ప్యాకెట్ మనీ వెచ్చించి ప్రభుత్వ పాఠశాలను బాగు చేశారని, పేద ప్రజలు తమ కొడుకులకు నాలుగు రూపాయలు కూడా ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా రాష్ర్ట ప్రభుత్వం రూ.8 వేల కోట్లు ఖర్చు చేసినా 10 శాతం పాఠశాలలను కూడా బాగు చేయలేదన్నారు. 20 వేల టీచర్ల ఉద్యోగాలు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయని, వాటిని భర్తీ చేయడం లేదన్నారు. ఇన్నాళ్లు టెట్ పరీక్ష నిర్వహించని రాష్ట్ర ప్రభుత్వం రెండు, మూడు నెలల్లో నిర్వహిస్తామని చెప్పడంలో ఉన్న మర్మం ఏంటని ప్రశ్నించారు. పారిశుధ్య కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.