బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభావంతో రెండు రోజుల పాటు ( అక్టోబర్ 21,22) తెలుగురాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో పలు జిల్లాల్లో ఉరుములు.. మెరుపులతో కూడిన వర్షం పడుతుంది. దీంతో తెలంగాణలో ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.
ఉపరితల ఆవర్తన ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుంది. నైరుతి తీరానికి ఆనుకుని పశ్చిమ బంగాళాఖాతానికి ఉత్తర తమిళనాడు తీర ప్రాంతంలో ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి సగటున 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని.. ఎత్తుకు వెళ్లేకొద్దీ నైరుతి దిశగా వంగి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో ఆవర్తనం సైతం అండమాన్ సముద్ర ప్రాంతంలో సగటున సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉందని వెల్లడించారు.ఇది ఉత్తర దిశగా పయనించి అక్టోబర్ 23వ తేదీనాటికి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.
దీని ప్రభావంతో తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు.. మరో రెండు రోజులు ఒక మోస్తరు వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది. దీంతో రెండు రోజుల పాటు ( అక్టోబర్ 21,22) నిర్మల్,ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్,ఆసిఫాబాద్, కరీంనగర్, జగిత్యాల,జయశంకర్ భూపాలపల్లి,రాజన్న సిరిసిల్ల, వరంగల్, హన్మకొండ, పెద్దపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.