ఢిల్లీ మురికివాడల్లో అగ్ని ప్రమాదం..మంటల్లో 800 గుడిసెలు..భయంతో జనం పరుగులు

ఢిల్లీ మురికివాడల్లో అగ్ని ప్రమాదం..మంటల్లో 800 గుడిసెలు..భయంతో జనం పరుగులు

దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం (ఏప్రిల్ 27) మధ్యాహ్నం రోహిణి ప్రాంతంలోని సెక్టర్ 17లోని శ్రీనికేతన్ అపార్టమెంట్ సమీపంలోని జుగ్గీ మురికివాడల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు స్థానికులు మృతిచెందారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో  అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది 20 ఫైరింజన్లతో మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు ఎగిసిపడుతుండటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. 

జుగ్గీ మురికావాడల్లో దాదాపు 800 గుడిసెలు మంటల్లో చిక్కుకున్నాయి. 100 కు పైగా గుడిసెలు కాలి బుడిదయ్యాయి.  స్థానికుల చెందిన డబ్బులు, బంగారు , రిక్షాలు, ఇళ్లలో సామాగ్రి అంతా కాలిపోయింది. మరోవైపు ఢిల్లీలో షకర్‌పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంత పరిధిలోని ఐటిఓ ప్రాంతానికి సమీపంలో ఉన్న అడవిలో కూడా అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని ఢిల్లీ అగ్నిమాపక విభాగం అధికారులు తెలిపారు.

అగ్ని ప్రమాదానికి పెరుగుతున్న రోజువారీ ఉష్ణోగ్రతలే కారణమయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. గత మూడు రోజులుగా ఢిల్లీలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మూడేళ్లలో ఏప్రిల్ నెలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే మొదటిసారి. ఆదివారం ఢిల్లీలో 42.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయ్యిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే రోజుల్లో ఢిల్లీలో మరింత ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. 

►ALSO READ | ఎనీటైమ్, ఎనీవేర్..యుద్దానికి సై అంటే సై అంటున్న ఇండియన్ నేవీ