
హైదరాబాద్ లోని కుత్భుల్లాపూర్ చెరువులో రెండు మృతదేహాలు లభ్యం కావడం కలకలం రేపింది. సోమవారం( మార్చి 24) చెరువులో రెండు మృతదేహాలు నీటిపై తేలడం స్థానికులను ఆందోళనకు గురిచేసింది. కుత్భుల్లాపూర్ పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫాక్స సాగర్ చెరువులో అనుమానాస్పదంగా రెండు మృతదేహాలు పడి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు.
ALSO READ | లక్ష కోట్ల కంపెనీలకు ఓనర్ కూడా భార్యా బాధితుడే : సంచలనంగా శంకర్ నారాయణ ఇష్యూ
సమాచారం తెలుసుకున్న పోలీసులు చెరువు వద్దకు చేరుకుని మృతదేహాలను బయటకు తీసి పరిశీలించారు. చనిపోయిన వారిలో ఒకరు సమీపంలో గల ఉమామహేశ్వర్ కాలనీ నివాసితులు నామ్ దేవ్(45)గా గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది.
అర్ధరాత్రి చెరువుకట్ట మీదుగా బైక్ పై వెళ్తుండగా దారి కనపడక పోవడంతో బైక్ తో సహా చెరువులో పడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. దారి కనపడకపోవడంతో చెరువులో పడిపోయారా లేక ఏదైనా కుట్ర దాగి ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.