![ఏపీకి బిగ్ అలర్ట్: బంగాళాఖాతంలో మరో రెండు అల్పపీడనాలు](https://static.v6velugu.com/uploads/2024/10/two-depressions-are-forming-in-the-bay-of-bengal_tSxNUD2Om3.jpg)
అమరావతి: మొన్నటి వరకు వర్షాలు, వరదలతో వణికిపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ మరో బ్యాడ్ న్యూస్ చెప్పింది. బంగాళాఖాతంలో రెండు అల్పపీడన ద్రోణులు ఏర్పడుతున్నాయని.. వీటి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు తీరాలకు సమీపంలో అక్టోబరు 7 లేదా 8 తేదీల్లో తుఫాను ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్, యానాం మీదుగా పశ్చిమ, వాయువ్య దిశలో తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని పేర్కొంది. ఈ అల్పపీడనం ప్రభావంతో రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసిన స్కైమేట్.. ఆంధ్ర ప్రదేశ్, యానాంలోని వివిధ ప్రాంతాలలో మెరుపులతో కూడిన ఉరుములు, వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
ఈ తుఫాను ప్రభావం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్రపై ఉంటుందని పేర్కొంది. ఇదిలా ఉంటే.. దక్షిణ బంగాళాఖాతం, దాని పరిసరాల్లో మరో అల్పపీడనం విస్తరించి ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఈశాన్య భారతదేశం అంతటా విస్తారంగా వర్షాలు ఉరుములతో కూడిన జల్లులకు పడే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్ మీదుగా అక్టోబర్ 5 నుండి అక్టోబర్ 7 వరకు ఈ అల్పపీడనం కదులుతోందని తెలిపింది.