పాలోళ్ల మధ్య భూముల లొల్లి గొడ్డళ్లతో దాడి..జక్కులపల్లిలో ఘటన

  • అక్కడికక్కడే ఇద్దరు మృతి.. మరో ఆరుగురి పరిస్థితి సీరియస్ 
  • ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం జక్కులపల్లిలో ఘటన

ఆసిఫాబాద్, వెలుగు:  వ్యవసాయ భూమి కోసం పాలోళ్ల మధ్య జరిగిన గొడవ గొడ్డళ్లు, కత్తులతో దాడి చేసుకునే దాకా వెళ్లింది. పరస్పర దాడుల్లో ఇద్దరు చనిపోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం జక్కులపల్లిలో సోమవారం జరిగిందీ ఘటన. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. రెబ్బెన మండలంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు. 

9 ఎకరాలపై దాయాదుల మధ్య గొడవ

జక్కులపల్లికి చెందిన నాగయ్య పేరిట గ్రామ శివారులో సర్వే నంబర్ 109, 110, 111, 128, 133, 134లలో 25 ఎకరాల భూమి ఉంది. ఇందులో తొమ్మిది ఎకరాలకు సంబంధించి నాగయ్య, అతని తమ్ముడు బక్కయ్య కుటుంబాల మధ్య వివాదం నడుస్తున్నది. నాగయ్య కొడుకులు దుర్గయ్య, నర్సయ్య, శంకర్‌‌లు ఈ వివాదం ఉన్న భూమిలో సాగు చేస్తున్నారు. దీనిపై గతంలో స్థానికంగా పంచాయితీ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఆ భూమిలో బక్కయ్య వర్గంలోని చెల్లెలు గిరిగుల బక్కక్క, బక్కయ్య కొడుకు మల్లయ్య ఆదివారం వెళ్లి పత్తి గింజలు నాటారు. మళ్లీ సోమవారం పెసర్లు వేసేందుకు వెళ్లారు. 

ALSO READ:కేజీబీవీల్లో పాత టీచర్లనే కొనసాగించాలి.. ప్రశ్నించిన ఆర్.కృష్ణయ్య

ఈ విషయం తెలుసుకున్న నాగయ్య కొడుకులు దుర్గయ్య, నర్సయ్య, శంకర్ చేను వద్దకు వచ్చారు. ఈ క్రమంలో భూమి తమది అంటే తమదని ఇరువర్గాలు గొడవ పడ్డాయి. ఈ గొడవ పెద్దదిగా మారి ఇరు వర్గాలు తమ వెంట తెచ్చుకున్న గొడ్డళ్లు, కర్రలు, కత్తులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణ లో గిరుగుల బక్కక్క (55), నర్సయ్య (22) తీవ్ర గాయాలై ఘటనా స్థలంలోనే మృతి చెందారు. బక్కయ్య, లక్ష్మణ్, దుర్గయ్య, సంతోష్, మధుకర్, గిరుకుల శంకర్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ట్రీట్‌మెంట్‌ కోసం మంచిర్యాలకు తరలించారు. వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తున్నది. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ సురేశ్ కుమార్.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు. లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.