దూసుకొచ్చిన మృతువు..వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

కీసర, వెలుగు : అతివేగం, నిర్లక్ష్యంతో వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందాడు. మేడ్చల్ జిల్లా కీసరలో లారీ డ్రైవర్ నిర్లక్ష్యానికి యువకుడు బలయ్యాడు. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 8 సమీపంలో బుధవారం ఎలక్ట్రిక్ స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని లారీ వెనక నుంచి దూసుకొచ్చి ఢీ కొట్టింది. అనంతరం అతడి కాళ్ల పైనుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 

మృతుడిని కీసర మండలం రాంపల్లికి చెందిన వారిమట్ల ఎలేంద్ర(35)గా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం డెడ్​బాడీని ఏరియా ఆసుపత్రికి తరలించారు. యాక్సిడెంట్​కు పాల్పడిన కీసర మండలం తిమ్మాయిపల్లికి చెందిన డ్రైవర్ లక్ష్మణ్​పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ఘట్​కేసర్ : ఘట్​కేసర్​పరిధిలో బైక్​ ఢీ కొని లారీ డ్రైవర్ మృతి చెందాడు. ఉప్పల్​కు చెందిన మోటె యాదయ్య (50) లారీ డ్రైవర్​గా పనిచేస్తున్నాడు. ఘట్​కేసర్ సమీపంలోని అవుషాపూర్ వద్ద బుధవారం తన వాహనం టైరు ప్రమాదశాత్తు పగిలిపోవడంతో కిందకు దిగి పరిశీలిస్తున్నాడు. ఈ క్రమంలో హైవేపై అతివేగంగా వస్తున్న బైక్​అతడిని ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. 

బైక్​డ్రైవర్​ను బీబీనగర్ మండలం జైనపల్లికి చెందిన శివరామకృష్ణ గా గుర్తించారు. అతడికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పరుశురాం తెలిపారు.