రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మెడికోలు మృతి

  • బైక్​పై వస్తూ ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన హౌస్​సర్జన్లు  
  • మహారాష్ట్రలోని దాబాకు వెళ్లి వస్తుండగా యాక్సిడెంట్​ 
  • కన్నీళ్లతో తుది వీడ్కోలు పలికిన స్నేహితులు

ఆదిలాబాద్​టౌన్, వెలుగు : ఆదిలాబాద్ ​రిమ్స్​మెడికల్ ​కాలేజీకి చెందిన ఇద్దరు మెడికోలు మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. థర్డ్​ఇయర్​చదువుతున్న ఏడుగురు స్టూడెంట్లు బైక్​లపై ఆదివారం రాత్రి కాలేజీ నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహారాష్ట్ర పాండ్రకవడ దాబాకు వెళ్లారు. అక్కడ రాత్రి డిన్నర్ చేసి తిరిగి ఆదిలాబాద్​కు ప్రయాణమయ్యారు.

హన్మకొండ జిల్లా పరకాలకు చెందిన డేవిడ్(22), ఏపీలోని విజయవాడకు చెందిన బాలసాయి(22) ఒకే బైక్​పై వస్తుండగా, మిగతా ఐదుగురు రెండు బండ్లపై బయలుదేరారు. డేవిడ్ ​బైక్ ​నడుపుతుండగా మార్గమధ్యలో ఆగి ఉన్న లారీని  గమనించకుండా వెనక నుంచి ఢీకొట్టాడు. దీంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు.

మిగతా ఐదుగురు ఆదిలాబాద్​సమీపంలోకి వచ్చాక డేవిడ్​, బాలసాయి రాకపోవడంతో  ఫోన్​ చేశారు. దీంతో లారీ డ్రైవర్ ​లిఫ్ట్ ​చేసి యాక్సిడెంట్​జరిగిందని చెప్పాడు. అక్కడికి చేరుకుని చూడగా ఇద్దరూ చనిపోయి ఉన్నారు.  వీకెండ్స్​లో మెడికోలు సమీపంలోని ప్రాంతాలకు టూర్లకు వెళ్తుంటారు. మూడు నెలల కింద కూడా సాత్నాల ప్రాజెక్టు దగ్గర వాగుకు పది మంది డాక్టర్లు టూర్​కు వెళ్లగా స్నానం చేస్తున్న ఆర్థో పీజీ స్టూడెంట్ ​ప్రవీణ్ ​నీటిలో మునిగి కన్నుమూశాడు.  

మెడికోల కంటతడి 

చనిపోయిన బాలసాయి, డేవిడ్​ మృతదేహాలను తోటి విద్యార్థులు, ప్రొఫెసర్ల సందర్శనార్థం రిమ్స్​లో ఉంచగా మెడికోలంతా కన్నీటి వీడ్కోలు పలికారు. ‘క్రిస్​మస్​కు  కలిసి వేడుకలు జరుపుకుందామనుకుంటే  అందని లోకాలకు వెళ్లిపోయావా’ అంటూ డేవిడ్​ కుటుంసభ్యులు అతడి మృతదేహంపై పడి ఏడ్చారు. పేద కుటుంబానికి చెందిన బాలసాయి తల్లిదండ్రులు తమకు విజయవాడ నుంచి రిమ్స్​ వరకూ వచ్చే స్థోమత లేదని 

మృతదేహాన్ని పంపించాలని విజ్ఞప్తి చేశారు. చివరకు ఎలాగో సాయంత్రం వరకు ఆదిలాబాద్​ చేరుకున్నారు. కొడుకు డెడ్​బాడీని చూసి  గుండెలవిసేలా రోదించారు. బాలసాయి చదువులో ముందుండేవాడని, రెండేండ్లలో చదువు పూర్తి చేసుకుని వస్తాడనుకుంటే ఇలా జరిగిందని కన్నీటి పర్యంతమయ్యారు.