నేలకొండపల్లి, వెలుగు: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సుర్దేపల్లి గ్రామంలో చెక్‌డ్యాం దగ్గర గురువారం గల్లంతైన ఇద్దరూ మృతిచెందారు. శుక్రవారం వారి డెడ్‌బాడీలను వెలికితీశారు. చెన్నారం గ్రామానికి చెందిన రంజిత్(24) గురువారం చేపలు పట్టేందుకు వెళ్లి చెక్‌డ్యాం దగ్గర వరద ప్రవాహంలో గల్లంతయ్యాడు. అతడిని వెతికేందుకు వచ్చిన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(డీఆర్ఎఫ్) టీమ్‌కు చెందిన వెంకటేశ్(32) చనిపోగా ప్రవీణ్(35) గల్లంతయ్యాడు.
శుక్రవారం ఉదయం రంజిత్ మృతదేహం చెక్‌డ్యామ్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో రామచంద్రాపురం గ్రామం వద్ద దొరికింది. శవాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కొద్దిగంటల తర్వాత ప్రవీణ్ మృతదేహం చెక్ డ్యాం వద్ద పైకి తేలింది. గమనించిన బంధువులు డెడ్‌బాడీని బయటకు లాగారు. ప్రవీణ్ బంధువులు తెల్లవారుజాము నుంచి ఘటనా స్థలంలో ఉన్నా ఏ ఒక్కరూ పట్టించుకోలేదని కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గల్లంతయిన వారిని గాలించే పనులు సైతం చేపట్టకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. వెంకటేశ్, ప్రవీణ్ మృతికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, ఆ కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. పోలీసులు వారికి నచ్చజెప్పి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఖమ్మం తరలించారు.
అన్యాయంగా నా కొడుకుని చంపారు
నీళ్లలో దిగి గాలించడం డీఆర్ఎఫ్ సభ్యుల పని కాదు. కానీ వాళ్లను అన్యాయంగా నీళ్లలో దింపి చంపేశారు. గల్లంతయిన వారిని గాలించడానికి ఏ ఒక్క అధికారి కూడా రాలేదు. మేం ఫోన్‌చేసినా స్పందించలేదు. గాలింపు చర్యలు చేపట్టకుండా, సమాచారం అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. చివరికి ప్రవీణ్ బాడీని మేమే దేవులాడుకోవాల్సి వచ్చింది. ఇందుకు కారణమైన ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలి. మాకు న్యాయం చేయాలి.
- రమాదేవి, ప్రవీణ్ తల్లి