న్యూ ఇయర్​ సందర్భంగా డ్రగ్స్​ ముఠాల గుట్టు రట్టు

న్యూ ఇయర్​ సందర్భంగా డ్రగ్స్​ ముఠాల గుట్టు రట్టు

నూతన సంవత్సరం సెలబ్రేషన్స్ సందర్భంగా డ్రగ్స్ మాఫియాపై తెలంగాణ రాష్ట్ర పోలీసులు ప్రత్యేక దృష్టిసారించారు. ఈ క్రమంలోనే రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రెండు అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలను పట్టుకున్నారు. ఒక కేసులో నేరెడ్​ మేట్​​ పోలీసులతో కలసి ఎల్బీనగర్ SOT పోలీసులు ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. నిందితులను  శీలం సాయి కృష్ణ (29), నైజీరియాకు చెందిన చిజియోక్ ఉచేచుకు అలియాస్ ఫీటర్ గా గుర్తించారు. ఒకొరో అనే మరో నైజీరియన్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఇద్దరు నిందితుల వద్ద నుంచి రూ.6 లక్షల విలువ జేసే 30 గ్రాముల మేధంపేటమీన్,1500 నగదు, 2 మొబైల్స్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు.

కంప్యూటర్ వర్క్ చేయడానికి 2014లో ఇండియాకు స్టూడెంట్ వీసాపై వచ్చిన ఫీటర్, డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు. ఫీటర్ కు గతంలో కూడా నేర చరిత్ర ఉందన్నారు. 2017లో పుణె డ్రగ్స్ కేసులో ఒక ఏడాది పాటు జైలుకు వెళ్లి వచ్చాడని తెలిపారు. శీలం సాయి కృష్ణ, ఫీటర్ కలిసి ముంబై నుండి హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. 

మరోకేసులో.. రాజస్థాన్ నుండి హైదరాబాద్ కు డ్రగ్స్ తరలిస్తున్న ముఠాను మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ. 35 లక్షలు విలువ చేసే 45 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్ లో 5 కోట్లకుపైగానే ఉంటుందని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఈ కేసులో రాజస్థాన్ కు చెందిన ప్రవీణ్ కుమార్ ను ప్రధాన నిందితుడిగా గుర్తిచారు. 

నిందితులకు 10 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందని సీపీ మహేష్ భగవత్ చెప్పారు. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేసి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కేసు విచారణ జరిగేలా చూస్తామని సీపీ మహేష్ భగవత్ అన్నారు.