టెక్సస్/రోచెస్టర్ హిల్స్: అమెరికాలోని టెక్సస్ స్టేట్‌లో ఘోరం జరిగింది. ఇరు వర్గాల మధ్య తలెత్తిన గొడవలో కాల్పులు జరగడంతో ఇద్దరు చనిపోయారు. పలువురు గాయపడ్డారు. ఆస్టిన్ కు ఉత్తరాన 30 కిలోమీటర్ల దూరంలో ఓల్డ్ సెట్లర్స్ పార్క్ లో శనివారం రాత్రి 11 గంటలకు ఓ పార్టీలో ఈ ఘటన జరిగింది. రాత్రి ‘జూన్ టీన్త్’ సెలబ్రేషన్ నిర్వహించారు.
వేడుకలో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఒకరు తుపాకీ తీసుకొని కాల్పులు జరిపారు. కాల్పుల్లో పలువురు గాయపడ్డారు. అక్కడే ఉన్న పోలీసులు, ఫైర్ డిపార్ట్ మెంట్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు ఫస్ట్ ఎయిడ్ చేసి సమీపంలోని హాస్పిటల్స్ కు తరలించారు. అప్పటికే ఇద్దరు చనిపోయారు. అయితే, చనిపోయిన వారు గొడవలో పాల్గొనలేదని పోలీసులు తెలిపారు. గాయపడిన మరికొంత మంది ట్రీట్ మెంట్ పొందుతున్నారని వెల్లడించారు. ఈ ఘటనలో అనుమానితులను ఇంకా పట్టుకోలేదని చెప్పారు. ఎంత మంది షూటర్లు కాల్పులు జరిపారో తెలియరాలేదని, కేసు దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.
మిషిగన్ స్టేట్‌లోనూ కాల్పులు..
మిషిగన్ రాష్ట్రంలోని డెట్రాయిట్ సబర్బ్‌లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో 9 మంది గాయపడ్డారు. బాధితుల్లో ఒక తల్లి, ఆమె ఇద్దరు కొడుకులు ఉన్నారు. డెట్రాయిబ్ సబర్బ్ లో రోచెస్టర్ హిల్స్‌లోని సిటీ పార్క్‌లో శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. పిల్లల కేరింతలతో సందడిగా ఉన్న ఆ పార్క్‌లోకి ఓ దుండగుడు వచ్చాడు. వచ్చీరావడంతోనే కాల్పులు జరిపి పారిపోయాడు.
మొత్తం 28 రౌండ్లు కాల్పులు జరిపాడు. విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. బాధితులను ఆసుపత్రికి తరలించారు. ఓ బాలుడికి తలలో, అతడి తల్లికి పొత్తి కడుపులో గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితీ విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. కాగా.. కాల్పులు జరిపిన దుండగుడు ఇంటికి వెళ్లి తనను తాను కాల్చుకుని చనిపోయాడని పోలీసులు తెలిపారు.