![గద్వాల డీసీసీ పోస్ట్‌కు బిగ్ ఫైట్ .. తమకే కావాలని పట్టు పడుతున్న రెండు వర్గాలు](https://static.v6velugu.com/uploads/2025/02/two-factions-are-insisting-on-wanting-gadwal-dcc-post-for-themselves_HhJLBj8Kna.jpg)
- పటేల్ ప్రభాకర్ రెడ్డి, నల్లారెడ్డి మధ్య తీవ్ర పోటీ
- ఈసారి మైనార్టీ వర్గానికి కేటాయించాలని డిమాండ్
గద్వాల, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి ఖాళీగా ఉన్న గద్వాల డీసీసీ అధ్యక్ష పదవికి బిగ్ ఫైట్ నెలకొంది. పార్టీలోని రెండు వర్గాలు తమకే డీసీసీ పోస్ట్ కావాలంటూ పట్టుబడుతున్నారు. ఎవరికి వారు హై కమాండ్ వద్ద పైరవీలు చేస్తున్నారు. మాజీ డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు నల్లారెడ్డి మధ్య పోటీ నెలకొన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి గద్వాల డీసీసీ అధ్యక్ష పీఠాన్ని మైనార్టీలకు ఇవ్వాలనే డిమాండ్ కూడా బలంగా వినిపిస్తోంది. ఈ మేరకు మైనార్టీకి చెందిన వారు పలువురు లీడర్లను కలిసి వినతులు అందించారు. ఎప్పటి నుంచో పార్టీకి సేవ చేస్తున్న మైనార్టీలకు పార్టీ పదవి ఇవ్వలేదని, ఈసారి తప్పకుండా తమకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మైనార్టీల నుంచి కలీం పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఈ ముగ్గురిలో ఎవరికైనా డీసీసీ పదవి వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.
రెండు వర్గాల మధ్య తీవ్ర పోటీ..
డీసీసీ అధ్యక్ష పదవి కోసం కాంగ్రెస్ లోని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వర్గం, మాజీ జడ్పీ చైర్ పర్సన్ సరిత వర్గాలు తమకు కావాలంటే తమకు కావాలంటూ పట్టుబడుతున్నారు. గతంలో ఓబీసీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న నల్లారెడ్డికి డీసీసీ ప్రెసిడెంట్ పదవి దక్కుతుందని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా పటేల్ ప్రభాకర్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఇదే క్రమంలో గద్వాలలో కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి మద్దతు ఇస్తున్న మైనార్టీలకు కూడా అవకాశం కల్పించాలని డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఓబీసీ చైర్మన్ నల్లారెడ్డికి ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, మాజీ జడ్పీ చైర్పర్సన్ సరిత మద్దతు పలుకుతున్నారు. పటేల్ ప్రభాకర్ రెడ్డికి ఎమ్మెల్యే మద్దతు తెలుపుతున్నారు. రెండు వర్గాలు వేర్వేరుగా ప్రపోజల్స్ పంపడంతో డీసీసీ ప్రకటన చాలా రోజుల నుంచి పెండింగ్ లో పెట్టారు.
ఏ పదవి ఇవ్వాలన్నా ఇబ్బందే..
జోగులాంబ గద్వాల జిల్లాలో ముఖ్యంగా గద్వాల నియోజకవర్గంలో కాంగ్రెస్ విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇక్కడ ఏ పదవి ఎవరికి ఇవ్వాలన్నా పార్టీకి పెద్ద తలనొప్పిగా మారుతోంది. దీంతో పార్టీ హైకమాండ్ ఆచితూచి అడుగులు వేస్తోంది. రెండు వర్గాల మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉండడంతో డీసీసీ అధ్యక్ష పదవిని ఎవరికి ఇవ్వాలనే దానిపై తీవ్ర కసరత్తు చేస్తోంది.
మైనార్టీలకు కేటాయించాలి..
గద్వాలలో కాంగ్రెస్ కు మైనార్టీ వర్గాలు అండగా ఉంటూ వస్తున్నాయి. గద్వాల డీసీసీ అధ్యక్ష పదవిని ఈసారి మైనార్టీలకు కేటాయించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే తమకు డీసీసీ పోస్ట్ ఇవ్వాలని పార్టీలోని మైనార్టీ లీడర్లంతా కలిసి హైకమాండ్ ను కోరారు.