కరీంనగర్, వెలుగు : ఐదేండ్ల కింద తప్పిపోయి.. కరీంనగర్ బాలసదన్ లో ఆశ్రయం పొందుతున్న ఓ పాప కోసం రెండు కుటుంబాలు పోటీపడడం ఆఫీసర్లకు తలనొప్పి తెచ్చిపెట్టింది. పాప ఇద్దరిలో ఎవరినీ గుర్తించకపోవడం, వచ్చినవాళ్లు సరైన ఆధారాలు చూపకపోవడంతో అసలు పేరేంట్స్ ఎవరో తేల్చడం కష్టంగా మారింది. దీంతో డీఎన్ఏ టెస్టు చేసి తల్లిదండ్రులను గుర్తించాలని నిర్ణయానికొచ్చారు. ఆఫీసర్ల కథనం ప్రకారం..కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఎగ్లాస్‌పూర్‌కు చెందిన గాదెపాక భాగ్యలక్ష్మి హైదరాబాద్‌లోని బసవతారకం హాస్పిటల్ లో పనిచేస్తోంది. ఆమెతోపాటు ఆండాల్ అనే మహిళ కూడా పనిచేస్తోంది. కొన్నాళ్ల కింద ఇంట్లో నుంచి తప్పిపోయిన ఓ చిన్నారి ఆండాల్ వద్దకు చేరింది. కొన్నాళ్లపాటు పాప ఆమె దగ్గరే ఉంది. ఆండాల్ శ్రీకాకుళం వెళ్తూ పాపను భాగ్యలక్ష్మికి అప్పగించి వెళ్లింది. ఈ క్రమంలోనే భాగ్యలక్ష్మి ఎగ్లాస్ పూర్ లో జరిగిన జాతరకు పాపతో కలిసి వచ్చింది.
పాపకు చెవిపోటు రావడంతో ఆర్ఎంపీ దగ్గరికి తీసుకెళ్లింది. బాలికకు తెలుగు సరిగా రాకపోవడం, హిందీలో మాట్లాడడంతో అమ్మాయిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారని.. భాగ్యలక్ష్మిని ఆర్ఎంపీ నిలదీశారు. ఆమె సరైన సమాధానం చెప్పలేకపోయింది. స్థానికులు సర్పంచ్ కు చెప్పడంతో పాటు ఆ పాప ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ నెల 10న సైదాపూర్ పోలీసులకు అప్పగించగా వారు కరీంనగర్ లోని బాలసదన్ కు తరలించారు. సోషల్మీడియాలో పోస్టులు చూసిన శ్రీకాకుళానికి చెందిన రవిచంద్రన్.. తమ పాపే అంటూ పీఎస్కు వచ్చారు. పాప వారిని గుర్తించకపోవడంతో అప్పజెప్పలేదు. ఇంతలోనే ఆ పాప తన మనవరాలే అంటూ తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదికి చెందిన పద్మ వచ్చింది.
2016లో తప్పిపోయిందని, పాప తల్లిదండ్రులు కువైట్‌లో ఉంటున్నారని వీడియో కాల్ ద్వారా అధికారులతో మాట్లాడించింది. వారూ తమ కూతురేనని చెప్పారు. శ్రీకాకుళం నుంచి ఒకరు.. తూర్పుగోదావరి నుంచి మరొకరు.. రావడంతో అధికారులకు ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో డీఎన్‌ఏ పరీక్షలకు పంపాలని నిర్ణయించారు.