మొగుళ్లపల్లి/వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట మునిగిపోవడంతో ఒక మహిళా రైతుతో పాటు మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం కొరికిశాల గ్రామానికి చెందిన గడ్డం హరికృష్ణ (27) అనే యువరైతు తనకున్న రెండెకరాలను సాగు చేయడంతో పాటు ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తన రెండెకరాల్లో పత్తి వేయగా, ఇటీవల కురిసిన భారీ వర్షాల కు పంట మొత్తం దెబ్బతిన్నది.
అంతేకాకుండా వరదలకు తన ఇల్లు కూలిపోయింది. దీంతో తన కుటుంబం రోడ్డున పడిందని తీవ్ర మనస్తాపం చెందిన హరికృష్ణ బుధవారం ఇంట్లో పురుగుల మందు తాగాడు. గమనించిన స్థానికులు అతన్ని హాస్పిటల్‌కు తరలించగా, చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన బీస సరోజన(45) అనే మహిళా రైతు తనకున్న నాలుగెకరాల్లో పత్తి సాగు చేసింది.
ఇటీవల భారీ వర్షాలు కురవడంతో వచ్చిన వరదలకు పంట మొత్తం కొట్టుకుపోయింది. దీంతో మనస్తాపం చెందిన సరోజన బుధవారం పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు ఆమెను వెంటనే హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరణించింది. ఆమెకు భర్త, కొడుకు, కూతురు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.