- వరంగల్ జిల్లాలో ఒకరు.. భూపాలపల్లి జిల్లాలో మరొకరు..
పర్వతగిరి, వెలుగు : మోటార్ ఆన్ చేసేందుకు వెళ్లగా వైర్ తగిలి కరెంట్ షాక్ తో ఓ రైతు చనిపోయాడు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడకు చెందిన బాల్య కుమార్(39) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శుక్రవారం ఉదయం తన భార్య సునీతతో కలిసి పత్తి చేను వద్దకు వెళ్లాడు. తర్వాత మోటార్ ను ఆన్ చేసేందుకు వెళ్లగా, అక్కడ పడి ఉన్న కరెంట్ వైర్ కుమార్ కు తగిలింది. దీంతో షాక్ కొట్టి అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్య సునీత ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పొలం చుట్టూ పెట్టిన కరెంట్ తీగలు తగిలి...
మల్హర్, వెలుగు : అడవి పందుల నుంచి పంటను కాపాడుకునేందుకు పొలం చుట్టూ అమర్చిన విద్యుత్ వైర్లు తగిలి ఓ రైతు చనిపోయాడు. భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం మల్లారం గ్రామానికి చెందిన యాదండ్ల గట్టయ్య (50) వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. అడవి పందులు పంటను నాశనం చేస్తుండడంతో వాటి బారి నుంచి కాపాడుకునేందుకు గురువారం రాత్రి పొలం చుట్టూ కరెంట్ తీగలు అమర్చాడు.
శుక్రవారం తెల్లవారుజామున పొలం వద్ద వెళ్లిన గట్టయ్య ఒడ్డుపై నడుస్తుండగా అదుపుతప్పి కరెంట్ తీగలపై పడ్డాడు. దీంతో షాక్ కొట్టి అక్కడికక్కడే చనిపోయాడు. గట్టయ్య భార్య ఓదక్క ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు కొయ్యూరు ఎస్సై నరేశ్ తెలిపారు.