ఇథనాల్​ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఇద్దరు రైతుల ఆత్మహత్యాయత్నం

  • ఇథనాల్​ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఇద్దరు రైతుల ఆత్మహత్యాయత్నం
  • పనుల కోసం వచ్చిన  జేసీబీలను అడ్డుకున్న గ్రామస్తులు  
  • జగిత్యాల జిల్లా వెల్గటూర్​మండలంలో ఉద్రిక్తత

వెల్గటూర్, వెలుగు : ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పాశిగామ, స్తంభంపల్లి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఇథనాల్ పరిశ్రమకు కేటాయించిన స్థలాన్ని చదును చేసేందుకు లారీలో తీసుకొచ్చిన జేసీబీలను కిందికి దించకుండా అడ్డుకున్నారు. జేసీబీలను వెనక్కి పంపించాలని, లేకపోతే పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకుంటామని ఇద్దరు రైతులు బెదిరించగా పోలీసులు అడ్డుకున్నారు. వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వినలేదు. తమ ప్రాణాలు పోయినా పర్వాలేదని, ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం జరగనిచ్చేది లేదంటూ పట్టుబట్టారు. ఎర్రటి ఎండలో 4 గంటలపాటు ఆందోళన చేశారు. చివరకు పోలీసులు జేసీబీలను వెనక్కి పంపించడంతో శాంతించి నిరసన విరమించారు.

ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ నెలరోజులుగా ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ ఆందోళన చేస్తుంటే పోలీసులు తప్ప అధికారులు, ప్రజాప్రతినిధులు తమ వద్దకు రాలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్​చేశారు. 

మొక్కలు కూడా పెరగవ్​

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పర్లపల్లిలో ఉన్న ఇథనాల్ ఫ్యాక్టరీని విజిట్​చేసిన ఓ బృందం బుధవారం పాశిగామకు వచ్చింది. ఈ సందర్భంగా  టీమ్​సభ్యులు కేజే రామారావు, బండారి లక్ష్మయ్య, బండారి విజయ, జయలక్ష్మి, మార్వాడి సుదర్శన్ గ్రామస్తులకు ఫ్యాక్టరీ ఏర్పాటు వల్లే జరిగే నష్టాలను వివరించారు. ఇథనాల్​విడుదలైన చోట మొక్కలు కూడా పెరగవన్నారు. చర్మ వ్యాధులు వస్తాయని, దుమ్ముతో రోగాలొస్తాయని, పొలాలన్నీ ఎడారిగా మారుతాయన్నారు. ఇక్కడి సమస్యను రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లి అన్ని ప్రజాసంఘాల సహకారంతో ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు.