అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య

నెక్కొండ/ఇల్లందు, వెలుగు: అప్పుల బాధ తట్టుకోలేక రాష్ట్రంలోని వేర్వేరు చోట్ల ఇద్దరు రైతులు సూసైడ్  చేసుకున్నారు. వరంగల్  జిల్లా నెక్కొండ మండలం అప్పల్ రావుపేట గ్రామానికి చెందిన మందపురి భిక్షపతి (48) తనకు ఉన్న రెండెకరాల్లో వ్యవసాయం చేయడంతో పాటు, గీత కార్మిక వృత్తి  కొనసాగిస్తున్నాడు. రెండేళ్ల క్రితం తన కూతురు వివాహం చేశాడు. అలాగే ఇల్లు కట్టాడు. దీంతో మొత్తం రూ.50 లక్షలకు పైగా అప్పులు అయ్యాయి. ఆరు నెలల కింద పొలం అమ్మి రూ.30 లక్షల అప్పు తీర్చేశాడు. ఇటీవలే తన కూతురు ఆరోగ్యం బాగా లేకపోవడంతో మళ్లీ రూ.2 లక్షలు అప్పు చేశాడు. కులం చిట్టీలో శనివారం రూ.15 వేలు కట్టాల్సి ఉంది. 

ఎంత ప్రయత్నం చేసినా డబ్బులు సర్దుబాటు కాకపోవడంతో తన పరువు పోతుందని మనస్తాపం చెందాడు. శనివారం ఇంట్లో ఫ్యాన్​కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మరోవైపు, భద్రాద్రి కొత్తగూడం జిల్లా ఇల్లందు మండలం సేవ్యా తండాలోనూ అప్పుల బాధ తట్టుకోలేక ఆంగోతు అమ్రు (52) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అమ్రు తనకున్న రెండెకరాల్లో మిర్చి సాగు చేశాడు. పెట్టుబడి కోసం రూ.2 లక్షలు అప్పు చేశాడు. తన కొడుకు ఊపిరితిత్తుల సమస్య బారిన పడడంతో ట్రీట్ మెంట్ కోసం మరో రూ.3 లక్షలు అప్పు తెచ్చాడు. అప్పుల విషయంలో భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం సాయంత్రం కూడా గొడవ జరగడంతో మనస్తాపానికి గురైన అమ్రు ఇంట్లో ఉరి వేసుకున్నాడు.