కందనూలు, వెలుగు : జాతీయ రహదారి కోసం భూమి రీ సర్వే చేయడంతో భూములు కోల్పోతున్న ఇద్దరు రైతులు శేఖర్, కురుమూర్తి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. ఈ సంఘటన తాడూరు మండల కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండల కేంద్రం మీదుగా జాతీయ రహదారి 167 కోసం రీ సర్వే చేపట్టారు. రోడ్డు పేద రైతుల భూముల మీదగా వెళ్లేలా మ్యాప్ మార్చారని, తమ భూములు పోయేలా సర్వే చేస్తున్నారని రైతులు అధికారులను ప్రశ్నించారు.
గతంలో సర్వే చేసి మ్యాప్ క్లియర్ చేసినా మళ్లీ రీసర్వే ఎందుకు చేస్తున్నారని ఆవేదన చెందారు. చేసేదేమీ లేక శేఖర్ క్రిమిసంహారక మందు తాగేందుకు ప్రయత్నించాడు, కురుమూర్తి ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధితులను ఇద్దరిని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు చికిత్సలు అందిస్తున్నారు. పోలీసులు సకాలంలో స్పందించడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు.