మెదక్ టౌన్/జగిత్యాల రూరల్, వెలుగు : రాష్ట్రంలో వేర్వేరు చోట్ల కరెంట్ షాక్ తో ఇద్దరు రైతులు చనిపోయారు. జగిత్యాల జిల్లా రూరల్ మండలం గుట్రాజ్ పల్లె గ్రామానికి చెందిన జుర్రు మల్లేశం(55) శనివారం తన పొలం వద్దకు వెళ్లాడు. పొలానికి నీళ్లు పెట్టేందుకు చూస్తుండగా మోటార్ స్టార్ట్ కాలేదు. దీంతో ట్రాన్స్ ఫార్మర్ వద్దకు వెళ్లి ఫ్యూజ్ చెక్చేస్తుండగా కరెంట్ సరఫరా అయి షాక్ కొట్టింది. కిందపడిన మల్లేశంను స్థానికులు జిల్లా కేంద్రంలోని సివిల్ హాస్పిటల్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్ లో ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతునికి భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. అలాగే మెదక్ పట్టణ పరిధి అవుసులపల్లిలో కరెంట్ షాక్తో రైతు మృతి చెందాడు.
రైతు కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అవుసులపల్లికి చెందిన కందుల రాములు (40) శనివారం ఉదయం తన పొలానికి వెళ్లాడు. అక్కడ చెట్ల కొమ్మలను కొడుతుండగా ప్రమాదవశాత్తు అవి విద్యుత్ వైర్లను తాకాయి. కింద నీరు ఉండటంతో రాములు కరెంట్ షాక్కు గురై పడిపోయాడు. గమనించిన చుట్టుపక్కల పొలాల్లోని రైతులు వచ్చి ఆయనను హుటాహుటిన మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించగా అప్పటికే రాములు మరణించాడని డాక్టర్లు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.