చిన్నచింతకుంట, వెలుగు: పంట పొలానికి నీళ్లు పారించేందుకు మోటార్ రిపేర్ చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి ఇద్దరు రైతులు అక్కడికక్కడే చనిపోయారు. వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం పర్దిపురం గ్రామానికి చెందిన గాదె మోహన్ రెడ్డి(57) రెండు ఎకరాల్లో, పూజారి కుర్వ మల్లప్ప(55) మూడెకరాల్లో వరి సాగు చేశారు. వీరిద్దరి పొలాలు పక్కపక్కనే ఉంటాయి. స్థానిక చెరువు నుంచి ఒకటే మోటార్బిగించుకుని పొలాలకు నీళ్లు పారించుకుంటున్నారు.
శుక్రవారం ఉదయం మోటార్పనిచేయకపోవడంతో, ఇద్దరూ కలిసి రిపేర్చేస్తుండగా కరెంట్‌షాక్ తగిలి అక్కడికక్కడే చనిపోయారు. స్థానిక రైతులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మోహన్‌రెడ్డికి భార్య, ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. మల్లప్పకు భార్య, ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. ఎస్సై ఆర్.శేఖర్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డెడ్‌బాడీలను వనపర్తి జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మల్లప్ప కొడుకు రాజశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
సిరిసిల్ల జిల్లాలో మరొకరు..
ముస్తాబాద్: పొలంలో కరెంట్ పోల్‌కు సపోర్ట్‌గా బిగించిన వైర్‌తగిలి కరెంట్ షాక్‌తో ఓ వ్యక్తి చనిపోయాడు. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నిమ్మలవారిపల్లె గ్రామానికి చెందిన నిమ్మల ప్రభాకర్(37) శుక్రవారం పశువుల మేత కోసుకొచ్చేందుకు పొలం వెళ్లాడు. ఒడ్డున గడ్డి కోసే క్రమంలో పక్కనే ఉన్న కరెంట్ పోల్, దానికి సపోర్ట్‌గా వైరును తాకాడు. షాక్‌తో కుప్పకూలి చనిపోయాడు.
ప్రభాకర్మృతికి సెస్అధికారుల నిర్లక్ష్యమే కారణమని మృతుని బంధువులు ఆరోపించారు. వైర్‌కు ఇన్సులెటర్ లేకపోవడంతో కరెంట్ సప్లై అయ్యి, ప్రభాకర్మృతి చెందాడని వాపోయారు. మృతుడి తండ్రి లింగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపారు. మృతునికి భార్య, ఓ పాప ఉన్నారు.