తహసీల్దార్ ఎదుట రైతుల ఆత్మహత్యా యత్నం

లింగంపేట్, వెలుగు : వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనానికి భూమి తీసుకున్న ఆఫీసర్లు వేరేచోట భూమి ఇవ్వకపోవడంతో ఇద్దరు రైతులు తహసీల్దార్​ఎదుట ఆత్మహత్యకు యత్నించాడు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం కొయ్యగుండు  తండాకు చెందిన నేనావత్ దస్లీ, లంబాడి అమ్రియం నుంచి 40 గుంటల భూమిని ఆఫీసర్లు వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం కోసం సేకరించారు. ఇద్దరు రైతులకు ముస్తాపూర్ శివారులోని ఎల్లారెడ్డి, కామారెడ్డి మెయిన్​రోడ్డుపై భూమిని చూపించారు. పట్టా సర్టిఫికెట్ మాత్రం మంజూరు చేయలేదు.

ఇద్దరు రైతులు పంటలు సాగు చేద్దామని ఆ భూమిని చదును చేయగా ఫారెస్ట్ ఆఫీసర్లు అడ్డుకొన్నారు. రైతులు సమస్య పరిష్కరించాలని పలుసార్లు తహసీల్దార్ ఆఫీస్​చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. దీంతో బుధవారం వారి భూమిలో ఏర్పాటు చేసిన వైకుంఠ ధామం, పల్లె పకృతి వనం కంచె తొలగించే ప్రయత్నం చేశారు. రెవెన్యూ ఆఫీసర్లు అడ్డుకోవడంతో రైతులు పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించగా తండావాసులు అడ్డుకొన్నారు. వారం రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని తహసీల్దార్​మారుతీ, సర్పంచ్ లలిత రాందాస్ హామీ ఇచ్చారు.