
ముంబై: ముంబైలో రెండు వేర్వేరు చోట్ల అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సౌత్ ముంబై బైకుల్లా ఏరియాలోని సాలెట్ 27 అనే విలాసవంతమైన భవనం 42వ అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఫర్నీచర్, విలువైన ఎలక్ట్రిక్ సామాగ్రి కాలి బూడిదయ్యాయి. ఈ ఘటన ఉదయం 10.45 గంటలకు చోటు చేసుకున్నది. రంగంలోకి దిగిన ఫైర్ సేఫ్టీ సిబ్బంది అతి కష్టం మీద మంటలు అదుపులోకి తీసుకొచ్చింది. 50 మంది ప్రాణాలు కాపాడింది. ఈ ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉన్నది.
అదేవిధంగా, అలీబాగ్ సమీపంలో జాలర్ల బోటులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 20 మంది మత్స్యకారులను ఇండియన్ కోస్ట్‌గార్డ్, నేవీ, ఆర్మీ సిబ్బంది రక్షించింది. శుక్రవారం తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బోటు 80శాతం కాలిపోయింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.