భారీ వర్షాలకు హైదరాబాద్ జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్లు పూర్తిగా నిండాయి. పై నుంచి వరద వస్తుండటంతో.. జులై 21వ తేదీ సాయంత్రం హిమాయత్ సాగర్ రెండు గేట్లు ఎత్తి.. కిందకు నీళ్లు విడుదల చేశారు అధికారులు. గేట్ నెంబర్ 5, గేట్ నెంబర్ 10 ను.. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఓపెన్ చేశారు. రెండు గేట్లను ఒక్క అడుగు మేరకు పైకి ఎత్తి.. నీటికి కిందకు వదులుతున్నారు. డ్యాంలోకి వరద పెరిగితే మరింత గేట్లు ఓపెన్ చేస్తామని చెబుతున్నారు అధికారులు.
హిమాయత్ సాగర్ గేట్లు తెరిచి.. మూసీ నదిలోకి నీటిని విడుదల చేస్తుండటంతో.. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. మరో నాలుగు, ఐదు రోజులు ఇలాగే విధంగా కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం హిమాయత్ సాగర్ లోకి ఇన్ ఫ్లో 12 వందల క్యూసెక్కులుగా ఉండగా.. రెండు గేట్ల నుంచి ఔట్ ఫ్లో 700 క్యూసెక్కులుగా ఉంది.
హిమాయత్ సాగర్ రిజర్వాయర్ గేట్లు ఓపెన్ చేసిన విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో చూడటానికి తరలి వస్తున్నారు. నిండు కుండలా ఉన్న హిమాయత్ సాగర్ చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్ కు భారీ వర్ష సూచనలు ఉన్నాయని.. దీంతో మరింత వరద వచ్చే అవకాశం ఉందని.. అప్పుడు గేట్లు ఎక్కువగా తెరుస్తాం అంటున్నారు అధికారులు.