- రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఇద్దరు బల్దియా ఉద్యోగులు
- టౌన్‌ప్లానింగ్ సూపర్ వైజర్, రైటర్‌ను అరెస్ట్ చేసిన ఏసీబీ
ఎల్బీనగర్, వెలుగు : జీహెచ్ఎంసీ ఉద్యోగులు ఇద్దరు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. సరూర్ నగర్ జోనల్ ఆఫీసులో ఈ ఘటన జరిగింది. ఏసీబీ అధికారులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడకు చెందిన జక్కేటి సుధాకర్ రెడ్డి వనస్థలిపురంలో ఓ ఇంటిని నిర్మిస్తున్నాడు. అనుమతుల కోసం సుధాకర్ రెడ్డి జోనల్ ఆఫీసులోని హయత్ నగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ సెక్షన్లో దరఖాస్తు చేశాడు.
టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ ఉమ, రైటర్ లక్ష్మణ్ రూ. 2 లక్షలు డిమాండ్ చేయగా చివరకు రూ. లక్షన్నరకు ఒప్పుకున్నారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. గురువారం ఆఫీసులో లంచం తీసుకుంటుండగా ఇద్దరు ఉద్యోగులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు.
సూపర్ వైజర్ ఇంట్లో తనిఖీలు?
సూపర్ వైజర్ ఉమ ఇంట్లోనూ తనిఖీలు ఏసీబీ చేసినట్లు తెలుస్తోంది. ఆమె ఇంట్లో భారీగా బంగారం, క్యాష్, విలువైన డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఉమ హయత్‌నగర్ సర్కిల్సెక్షన్లో పనిచేస్తూ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆమె ఏసీబీకి పట్టుబడినట్టు తెలియడంతో ఆఫీసుకు వచ్చిన కొందరు జనం సంతోషం వ్యక్తం చేసినట్లు సమాచారం.