తల్లి మృతితో అనాథలైన ఆడ పిల్లలు

రామడుగు, వెలుగు: చిన్నతనంలోనే తండ్రి వదిలేసి వెళ్లగా, తాజాగా తల్లి మృతితో కరీంనగర్​జిల్లాలో ఇద్దరు ఆడపిల్లలు అనాథలయ్యారు. గ్రామస్తుల సహకారంతో తల్లి మృతదేహానికి పెద్ద కూతురు అంత్యక్రియలు నిర్వహించింది. రామడుగు మండలం గోపాల్​రావుపేటకు చెందిన అలువాల వెంకటేశం, తార(40) దంపతులకు దీపిక(13), ధనశ్రీ(11) ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 

కొన్నేండ్ల కింద వెంకటేశం భార్య, పిల్లలను వదిలేసి వెళ్లగా, తార టైలరింగ్ పనిచేస్తూ కూతుళ్లను చదివించుకుంటోంది. పెగడపల్లి కేజీబీవీలో దీపిక 8వ, ధనశ్రీ 6వ తరగతి చదువుతున్నారు. కాగా తల్లి తార అనారోగ్యంతో బాధపడుతూ గురువారం చనిపోయింది. గ్రామస్తుల సహకారంతో పెద్ద కూతురు దీపిక అంత్యక్రియలు పూర్తిచేసింది. అనాథలైన ఆడ పిల్లలను ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.