
- అనుమానంతో భార్యను చంపిన భర్త
- చోరీని అడ్డుకున్న యువకున్ని చంపిన దొంగలు
జూబ్లీహిల్స్,వెలుగు: పెళ్లై పాతికేళ్ల తర్వాత భార్యపై అనుమానంతో గొంతునులిమి చంపిన ఘటన బోరబండ పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి 11.30కు జరిగింది. ఇన్స్పెక్టర్ సురేందర్ వివరాల ప్రకారం బోరబండ సైట్-3 రాజీవ్ గాంధీనగర్‌కు చెందిన నరేందర్, పద్మ (49) దంపతులు. వీరికి 25 ఏళ్ల క్రితం పెండ్లయింది. ఇద్దరు పిల్లలున్నారు.
నరేందర్ స్థానికంగా పాల ప్యా కెట్లను అమ్ముతూ ఉంటాడు. అతను భార్యపై అనుమానంతో తరచూ ఘర్షణ పడుతున్నాడు. ఎప్పటిలాగే భార్యతో గొడవపడిన నరేందర్ బుధవారం రాత్రి ఆమె గొంతు నులిమి చంపేశాడు. అనంతరం పోలీసులకు లొంగి పోయాడు. పద్మ మృత దేహాన్ని పోస్టు మార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చేవెళ్ల : వైన్ షాపులో చోరీ చేస్తుండగా.. అడ్డు వచ్చిన యువకుడిని హత్య చేసిన ఘటన షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ కాంతారెడ్డి వివరాల ప్రకారం... మండల కేంద్రంలోని దుర్గా వైన్స్ షాపు పక్కన ఉన్న కూల్ పాయింట్ లో షాబాద్ గ్రామానికి చెందిన చేగూరి భిక్షపతి ఆలియాస్ ప్రవీణ్ (35) పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి పని ముగించుకుని ఎప్పటిలాగానే వైన్ షాపు పక్కన పర్మిట్ రూమ్‌లో పడుకున్నాడు.
అర్ధరాత్రి దుండగులు వైన్ షాప్‌లో దొంగతనానికి పాల్పడ్డాడు. వైన్ షాపు వెనకాల గోడను పగులగొట్టి రంద్రం చేసి షాపులోకి ప్రవేశించి క్యాష్ కౌంటర్లో ఉన్న రూ.40వేల నగదుతో పాటు మద్యం బాటిళ్లు, సీసీ కెమెరా డివైజ్ ను ఎత్తుకెళ్తుండగా భిక్షపతి గమనించాడు. వారికి అడ్డు పడడంతో దుండగులు అతడి తలపై బలంగా కొట్టారు. దీంతో అతను అక్కడిక్కడే మృతిచెందాడు. ఘటన స్థలాన్ని ఉదయం చేవెళ్ల ఏసీపీ కిషన్, క్ర్తైం ఏపీసీ శశాంక్‌రెడ్డి, సీసీఎస్, ఎస్ఓటీ ఇన్స్పెక్టర్లు ప్రశాంత్ పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.