భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో షార్ట్ సర్క్యూట్తో రెండిళ్లు దగ్ధం.. వ్యక్తి సజీవ దహనం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో షార్ట్ సర్క్యూట్తో రెండిళ్లు దగ్ధం.. వ్యక్తి సజీవ దహనం
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎర్రగుంట శివారులో ఘటన

అన్నపురెడ్డిపల్లి, వెలుగు: షార్ట్ సర్క్యూట్ తో రెండిళ్ళు దగ్ధం కాగా.. వ్యక్తి సజీవ దహనమైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. బాధిత కుటుంబసభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంట శివారు తాలుకాదారు బంజరకు చెందిన షేక్ గౌస్ పాషా (35)కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అతనికి పదేండ్ల కింద పక్షవాతం వచ్చి మంచానికే పరిమితమయ్యాడు.

బుధవారం అర్ధరాత్రి ప్రమాదవశాత్తు ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయింది. ఆ సమయంలో ఇంట్లో నిద్రిపోయిన గౌస్ పాష బయటకు రాలేక కాలిబూడిదయ్యాడు. రోజూ గౌస్ పాషా వద్ద తండ్రి పడుకునేవాడు. భార్య , పిల్లలు పక్కనే పుట్టింట్లో నిద్రిస్తుంటారు. ఆ రోజు అర్ధరాత్రి మృతుడి తండ్రి టాయిలెట్కు వెళ్లేందుకు బయటకు వెళ్లగా అప్పటికే ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి.

గడ్డి ఇల్లు కావడంతో మంటలు ఒక్కసారిగా వ్యాపించి పొగలు కమ్ముకున్నాయి. కొడుకును కాపాడేందుకు తండ్రి ప్రయత్నించేలోపే గౌస్ పాషా కాలిపోయాడు. ఆపై మంటలు పక్కనే షేక్ యాకూబ్ ఇల్లుకు కూడా వ్యాపించగా పూర్తిగా కాలి బూడిదైంది. సమాచారం అందడంతో జూలూరుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐ చంద్రశేఖర్ వెళ్లి గ్రామస్తుల సాయంతో  మంటలను అదుపు చేశారు.

ఫైర్ ఇంజన్ కు ఫోన్ చేయగా మూడు గంటలు లేట్గా రావడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనలో రూ.30 వేల నగదు, రూ.5 లక్షల  ఆస్తినష్టం జరిగింది.  మృతుడి కుటుంబాన్ని గురువారం అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పరామర్శించారు. ప్రభుత్వం పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. తహసీల్దార్ జగదీశ్వర ప్రసాద్, ఆర్ఐ మధు గురువారం తక్షణ సాయం కింద బాధిత కుటుంబానికి రూ.5 వేల నగదు, 30 కేజీల బియ్యం, నిత్యావసరాలు అందించారు.