
హుస్నాబాద్, వెలుగు : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోపట్టపగలు రెండు ఇండ్లలో దొంగలుపడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం పట్టణంలోని రావూస్కాలనీలో మంత్రి పొన్నం ప్రభాకర్ పక్క ఇంట్లో, సుభాష్‌నగర్‌లోని మరో ఇంట్లో దొంగలు పడి రూ.80వేలతోపాటు 10 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. తాళం వేసి బయటకు వెళ్లిన ఇంటి యజమానులు తిరిగి ఇండ్లకు చేరుకోగా అప్పటికే తలుపులు తెరుచుకొని ఉండడంతో అనుమానంతో లోపలికి వెళ్లారు.
ఇండ్లలోని వస్తువులు చిందరవందరగా పడి ఉండడంతో దొంగతనం జరిగినట్టు భావించారు. ఇంట్లోకి వెళ్లి చూడగా, డబ్బు, బంగారం కనిపించకపోవడంతో లబోదిబోమన్నారు. సమాచారం తెలుసుకున్న సీఐ కిరణ్, ఎస్ఐ మహేశ్ సిబ్బందితో వచ్చి దొంగతనం జరిగిన ఇండ్ల చుట్టు పక్కల పరిసరాలను పరిశీలించారు. క్లూస్ టీమ్‌తో వేలిముద్రలు సేకరించారు. ఇండ్ల సమీపంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. క్యాప్ ధరించి, ముఖానికి కర్చీప్ కట్టుకొని సంచరిస్తున్న ఓ వ్యక్తిని గుర్తించారు. సదరు వ్యక్తి కోసం గాలింపు మొదలుపెట్టారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.