కొలంబో : కొంత మంది యంగ్ బ్యాటర్లలో బౌలింగ్ నైపుణ్యాన్ని కూడా మెరుగుపర్చే ప్రక్రియను టీమిండియా చేపట్టిందని బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే అన్నాడు. ఈ లిస్ట్‌లో తెలుగు బ్యాటర్ తిలక్ వర్మ ముందున్నాడని తెలిపాడు. ‘అండర్–19 నుంచి నేను తిలక్‌ను చూస్తున్నా. సౌతాఫ్రికాలో ఉన్నప్పుడు అతని బౌలింగ్ నైపుణ్యాన్ని చూశాం. ఆ స్కిల్స్ చూసి మేం చాలా ముచ్చటపడ్డాం. అందుకే అతనిపై మేం స్థిరంగా పని చేస్తున్నాం. రాబోయే రోజుల్లో తిలక్ బ్యాటర్ కమ్ బౌలర్‌గా పనికొస్తాడు. ఆ తరహాలో అతన్ని పూర్తి స్థాయిలో తీర్చిదిద్దుతున్నాం.
ఒక బ్యాటర్.. బౌలింగ్ కూడా చేయగలడనే విశ్వాసం కెప్టెన్‌కు కలగాలి. ఒక ఓవర్ నుంచి మొదలుపెడితే అది క్రమంగా ఐదు, పది ఓవర్లకు పెంచేలా మేం తర్ఫీద్ ఇస్తాం. అయితే ఎక్స్‌ట్రా బౌలర్ అనేది పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది’ అని మాంబ్రే వ్యాఖ్యానించాడు. ఇక వన్డే వరల్డ్ కప్‌కు నలుగురు పేసర్లు ఫుల్ ఫిట్‌నెస్‌తో అందుబాటులో ఉండటం చాలా సానుకూల పరిణామం అని చెప్పాడు. ఆసియా కప్‌లో బుమ్రా బౌలింగ్ అదిరిపోయిందన్నాడు. అయితే ఫస్ట్ చాయిస్ పేసర్లు బుమ్రా, సిరాజ్‌తో పాటు హార్దిక్‌ను తీసుకోవడంపై కూడా కోచ్ స్పందించాడు.
షమీలాంటి పేసర్‌ను రిజర్వ్‌కు పరిమితం చేయడం చాలా కష్టమని తేల్చాడు. కానీ మ్యాచ్ పరిస్థితులను బట్టి కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తప్పవని స్పష్టం చేశాడు. చాన్స్ ఇవ్వలేనప్పుడు సదరు ప్లేయర్‌తో చర్చిస్తామన్నాడు. ప్రస్తుతం హార్దిక్ పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయడం చాలా ఆనందాన్నిస్తుందని మాంబ్రే వెల్లడించాడు.