హైదరాబాద్‎లో ఇద్దరు అంతర్జాతీయ సైబర్ నేరగాళ్లు అరెస్ట్

హైదరాబాద్‎లో ఇద్దరు అంతర్జాతీయ సైబర్ నేరగాళ్లు అరెస్ట్

హైదరాబాద్: సైబర్ మోసాలకు పాల్పడుతోన్న ఇద్దరు అంతర్జాతీయ నేరగాళ్ల ఆటకట్టించారు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు. బిజినెస్ ఇన్వెస్ట్ మెంట్ పేరుతో మోసాలు చేస్తోన్న ఇద్దరిని బుధవారం (మార్చి 26) అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. నిందితులు అమర్ నాథ్ సింగ్, రణ్ వీర్ సింగ్ అంతర్జాతీయ కంపెనీల్లో పెట్టుబడుల పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. 

ALSO READ | ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఏంటో.. మాటల్లో కాదు చేతల్లో చూపించాం: మంత్రి శ్రీధర్ బాబు

మొబైల్ ఫోన్ల ద్వారా ఆర్డర్లు అందిస్తామని ప్రలోభపెట్టి పలువుర్ని బురిడి కొట్టించారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‎కు చెందిన ఓ వ్యక్తికి నకిలీ మెయిల్ పంపి సుమారు 10 లక్షల రూపాయలు మోసానికి పాల్పడ్డారు. బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన సిటీ సైబర్ క్రైం పోలీసులు.. అంతర్జాతీయ మోసాలకు పాల్పడుతోన్న అమర్ నాథ్ సింగ్, రణ్ వీర్ సింగ్‎లను చాకచక్యంగా వ్యవహరించి బుధవారం (మార్చి 26) అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా ప్రజలకు సైబర్ క్రైం పోలీసులు మరోసారి కీలక సూచనలు చేశారు. గుర్తు తెలియని నెంబర్ల నుంచి ఫోన్ కాల్స్, మేసేజ్‎ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కొత్త నెంబర్ల నుంచి వచ్చే మేసేజులు, లింక్‏లను ఓపెన్ చేయొద్దని హెచ్చరించారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచన చేశారు. చాకచక్యంగా వ్యవహరించి అంతర్జాతీయ సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసిన సిబ్బందిని ఉన్నతాధికారులు ప్రశంసించారు.