
పెనుబల్లి, వెలుగు: తెలంగాణ, ఏపీలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను ఖమ్మం జిల్లా విఎం బంజరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కల్లూరు ఏసీపీ రఘు సోమవారం విఎం బంజరు పోలీస్ స్టేషన్ లో ప్రెస్ మీట్‌లో వివరాలు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటకు చెందిన మక్కెళ్ల నాగరాజు, ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామానికి చెందిన చల్లా శివప్రసాద్ జల్సాలకు అలవాటుపడి ఈజీ మనీ సంపాదించాలని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 13 బైక్‌లు, ఏపీలోని జంగారెడ్డి గూడెంలో 4 బైక్‌లు, ఏలూరు జిల్లాలో ఒక బైక్‌ను దొంగిలించి పెనుబల్లి, అన్నపురెడ్డిపల్లి మండలాల్లో కొంతమందికి అమ్ముకుని వచ్చిన డబ్బుతో పేకాట, కోడిపందెలు జల్సాలకు వాడుకున్నారని తెలిపారు.
ఇద్దరు కలిసి దొంగిలించిన బైక్‌లను ఆదివారం అమ్మడానికి తీసుకెళ్తుండగా విఎం బంజరు ఎస్‌ఐ వెంకటేశ్ వాహన తనిఖీలు చేస్తుండగా పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా వారు చేసిన దొంగతనాలు బయటపడ్డాయని తెలిపారు. వీరితో పాటు వీరి దగ్గర దొంగిలించిన బైక్‌లు కొన్న ఎనిమిది మందిపై కూడా కేసు నమోదు చేసినట్లు ఏసీపీ రఘు తెలిపారు. అంతరాష్ట్ర దొంగలను పట్టుకుని బైక్‌లను స్వాధీనం చేసుకున్నామని వాటి విలువ రూ. 12 లక్షల ఉంటుందని తెలిపారు. కేసును విచారించిన సత్తుపల్లి రూరల్ సీఐ ముత్తు లింగయ్యను, విఎం బంజరు ఎస్‌ఐ వెంకటేశ్‌ను స్టేషన్ సిబ్బందిని ఏసీపీ అభినందించారు.