దుబాయ్: ఇరాన్లో దారుణం చోటుచేసుకుంది. రాజధాని టెహ్రాన్‌లోని సుప్రీంకోర్టు వెలుపల శనివారం ఒక వ్యక్తి ఇద్దరు ప్రముఖ న్యాయమూర్తులను కాల్చి చంపాడు. అనంతరం దుండగుడు తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో జడ్జీలలో ఒకరి బాడీగార్డ్ కూడా గాయపడ్డాడు. మరణించిన ఇద్దరు న్యాయమూర్తులను మొహమ్మద్ మొఘీసే, అలీ రజినిగా గుర్తించారు. వీరు 1988లో అసమ్మతివాదుల సామూహిక ఉరిశిక్ష కేసుతో సంబంధం ఉన్నవారిగా తెలుస్తోంది.
అయితే, ఈ కాల్పులకు పాల్పడింది ఎవరనేది ఇప్పటి వరకు ఏ గ్రూపు కూడా ప్రకటించలేదు. రజినిపై1999లోనూ ఒకసారి హత్యాయత్నం జరిగింది. మోటార్ సైకిళ్లపై వచ్చిన దుండగులు రజిని వాహనంపై పేలుడు పదార్థాన్ని విసిరారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం దాడికి పాల్పడిన వ్యక్తి సుప్రీంకోర్టులో ఎలాంటి కేసు వేయలేదని, అతను కోర్టు శాఖల క్లయింట్ కూడా కాదని న్యాయవ్యవస్థకు చెందిన మిజాన్ వార్తా సంస్థ తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.