- కరీంనగర్ జిల్లా తాటికల్ వద్ద ప్రమాదం
హుజూరాబాద్/మొగుళ్లపల్లి (టేకుమట్ల) వెలుగు : దోస్తులను వేములవాడ దర్శనానికి తీసుకెళ్తూ ఇద్దరూ అనంత లోకాలకు కెళ్లారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాటికల్ సమీపంలో లారీ, కారు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. మృతులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని పలు గ్రామాలకు చెందిన వ్యక్తులు. కేశవపట్నం ఎస్సై పాకాల లక్ష్మారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. టేకుమట్ల మండలం ఏంపేడుకు చెందిన మ్యాడగొని శ్రావణ్ (32) బతుకుదెరువు కోసం హైదరాబాద్ కు వలసవెళ్లాడు. క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.
వేములవాడ దర్శనం కోసం ఓ కుటుంబాన్ని తన వెహికల్ లో తీసుకెళ్లాడు. అక్కడ వాళ్లను వదిలిపెట్టి హనుమకొండలో చదువుకుంటున్న పంగిడిపల్లెకు చెందిన తన బామ్మర్ది ఆకాశ్ (22) తో పాటు అదే గ్రామానికి చెందిన తన స్నేహితుడు రాకేష్ ను వేములవాడకు తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాటికల్ గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న లారీ వారి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రావణ్, ఆకాశ్ స్పాట్ లోనే చనిపోగా రాకేష్ కు తీవ్ర గాయాలయ్యాయి.
అతడిని కరీంనగర్ హాస్పిటల్ కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ యశోద హాస్పిటల్ కు తరలించారు. మృతుడు ఆకాశ్ తండ్రి రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై లక్ష్మారెడ్డి తెలిపారు. ప్రమాద వార్తతో మృతుల గ్రామాల్లో విషాదం నెలకొంది.