జమ్మూకాశ్మీర్‌లో టెర్రరిస్టుల కాల్పుల్లో ఇద్దరు లేబర్ మృతి

జమ్మూకాశ్మీర్‌లో టెర్రరిస్టుల కాల్పుల్లో ఇద్దరు లేబర్ మృతి

సరిహద్దు ప్రాంతంలో ఉగ్రదాడులు పెరిగిపోతున్నాయి. జమ్మూ కాశ్మీర్‌లోని గందర్‌బాల్ జిల్లా సోనామార్గ్ ప్రాంతంలో ఇద్దరు వలస కార్మికులను ఉగ్రవాదులు కాల్చిచంపినట్లు అధికారులు తెలిపారు. అక్టోబర్ 20 (ఆదివారం) సాయంత్రం సోనామార్గ్‌ నిర్మాణంలో ఉన్న సొరంగం సమీపంలో ఈ దాడి జరిగింది. ఈ సొరంగం గగనీర్‌ను సెంట్రల్ కాశ్మీర్‌లోని సోనామార్గ్‌కు కలుపుతుంది. వెంటనే ప్రాంతాన్ని భారత బలగాలు చుట్టుముట్టాయి. ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. మృతులు సొరంగ మార్గ నిర్మాణంలో పనిచేసే కార్మికులుగా గుర్తించారు.

అక్టోబరు 18న కూడా దక్షిణ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలోని జైనాపోరాలోని వదునా ప్రాంతంలో బీహార్ కు చెందిన ఓ వలస కార్మికుడిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. కార్మికుడిని అశోక్ చౌహాన్‌గా గుర్తించామని, అనంతనాగ్‌లోని సంగమ్ ప్రాంతంలో నివసిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇది జరిగిన రెండు రోజులకే మరో వలస కార్మికులపై ఇప్పుడు మళ్లీ కాల్పులు జరిగాయి.