- రెండు లక్షల ఎకరాల్లో నాట్లు
- 86 వేల ఎకరాల్లో ఇతర పంటలు
- వర్షాభావ పరిస్థితులతో దిగుబడి అంచనాలపై ఆందోళన
- ఈసారి ఆశించిన స్థాయిలో పడని వానలు
- ఎస్సారెస్పీపైనే రైతుల ఆశలు
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో వరి సాగు పెరిగింది. జులైలో ప్రారంభమైన నాట్లు.. ఆగస్టు మధ్య వరకు జోరందుకున్నాయి. ఇప్పటివరకు 2లక్షల ఎకరాల్లో వరి సాగు పెరిగినట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఇంకా వరి నాట్లు వేస్తుండగా.. మరికొంత పెరిగే అవకాశముందంటున్నారు. ఇతర పంటలు 86 వేల ఎకరాల్లో సాగైనట్లు పేర్కొంటున్నారు. కాగా ఈసారి వర్షాభావ పరిస్థితులతో దిగుబడి అంచనాలపై అధికారులు, రైతుల్లో ఆందోళన కనిపిస్తోంది.
ఆశించిన స్థాయిలో వానలు పడలే..
పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 2.86 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేయగా.. ప్రధానంగా వరి 2లక్షల ఎకరాలు, పత్తి 59వేల ఎకరాల్లో వేశారు. కాగా పెద్దపల్లి జిల్లాలో ఈసారి ఆశించిన స్థాయిలో వానలు పడలేదు. ఇప్పటి వరకు జిల్లాలో 460 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెప్తున్నారు. జులైలో కురిసిన వర్షాలకు చెరువులు, కుంటలు నిండడంతో రైతులు పనులు మొదలు పెట్టారు.
ఎస్‌ఆర్‌ఎస్పీ పైనే ఆధారం
పెద్దపల్లి జిల్లాలో ఎస్సారెస్పీ కింద 1.86 లక్షల ఎకరాలు, ఎల్లంపల్లి కింద 22 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. కానీ వివిధ కారణాల వల్ల మంథని, రామగిరి, కాల్వశ్రీరాంపూర్, ఓదెల మండలాల్లోని సుమారు 30వేల ఎకరాల చివరి ఆయకట్టుకు కాల్వ నీళ్లు అందడం లేదు. దీంతోపాటు జిల్లా రైతులకు ఆధారమైన శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కూడా ఇంకా నిండకపోవడంతో పంటలకు నీరుందుతుందో లేదోనన్న ఆందోళనలో రైతులు ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్‌ఆర్ఎస్పీలో పూర్తి స్థాయి నీటిమట్టం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 40 టీఎంసీలే ఉంది.
60 టీఎంసీలకు చేరితేనే నీటి విడుదల సాధ్యమవుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం అడపాదడపా కురుస్తున్న వర్షాలతో కొంతకాలం నెట్టుకొచ్చినా రానున్న రోజుల్లో పంటలకు నీటి అవసరం పెరుగుతుంది. దీంతో రైతులు ప్రాజెక్టు నీటి విడుదలపైనే ఆధారపడాల్సి ఉంటుంది. కొన్నాళ్లుగా ఎస్సారెస్పీ నీటిని వారబందీ పద్ధతిలో విడుదల చేస్తున్నారు.ఈ క్రమంలో చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదని గతంలో చాలాసార్లు రైతులు ఆందోళనకు కూడా దిగారు. ఈసారి ఎలాంటి పరిస్థితిలో అయినా చివరి ఆయకట్టు వరకు నీరు అందించి తీరుతామని అధికారులు చెప్తున్నారు. అలాగే అంచనా దిగుబడిని సాధించి
తీరుతామంటున్నారు.