ఒకే శిలపై రెండు శాసనాలు వేయించిన ఇద్దరు మహారాజులు

  • వేయించిన ముత్తాత గణపతి దేవుడు, మనవడు ప్రతాపరుద్రుడు
  • ఎన్నో విశేషాలను తెలియజేస్తున్న కట్టకూరు శాసనం

ఒకే శిలపై వేర్వేరు కాలాలకు చెందిన ఇద్దరు మహారాజులు దాన శాసనాలు వేయించిన ఘటనలు చరిత్రలో అరుదు. కానీ, కాకతీయుల కాలం నాటి అలాంటి శాసనం ఒకటి ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం కట్టకూరు గ్రామంలోని పొలాల్లో మా కొత్త తెలంగాణ చరిత్ర బృందానికి లభ్యమైంది. ఒకే శిలపై ఇద్దరు మహారాజుల దాన శాసన పాఠాలు రాసి ఉన్నాయి. ఈ శాసనం వేయించిన వారిద్దరూ కాకతీయ సామ్రాజ్యాన్ని అప్రతిహతంగా పాలించిన గణపతి దేవుడు, ప్రతాపరుద్రుడు. ప్రతాపరుద్రునికి గణపతి దేవుడు ముత్తాత అవుతాడు. వారి ఇద్దరి దానాల మధ్యా 105 సంవత్సరాల ఎడం ఉండడం మరింత ఆసక్తిని కలిగిస్తోంది. తెలుగన్నడ లిపిలో, తెలుగు సంస్కృతం భాషలో ఈ శాసనం రాసి ఉంది.

హన్మకొండ రాజధానిగా పాలించిన కాకతీయ గణపతి దేవుడు కట్టకూరు గ్రామంలో క్రీస్తు శకం 1198 ఏప్రిల్ 21(మంగళవారం)న శ్రీగోపీనాథ స్వామి తిరుప్రతిష్ట చేశారు. ఈ విషయాన్ని ఒక అడుగు మందం, ఆరడుగుల ఎత్తు ఉన్న నల్ల గ్రానైట్ రాతిపై ఒకవైపు 47 వరుసల్లో వివరంగా రాసి పెట్టారు. దానికి అపసవ్య దిశలో పక్కనే ఉన్న దిక్కున ప్రతాపరుద్రుడు వేయించిన దాన శాసనం కనిపిస్తోంది. ఇది క్రీస్తు శకం 1303 ఆగస్టు 2(గురువారం) నాటిది. అంటే ముత్తాత గణపతి దేవుని శాసనం తర్వాత 105 సంవత్సరాల 3 నెలల 11 రోజులకు వేయించినది.

కాకతీయుల పరమత సహనం

మొదట జైన మతాన్ని అవలంబించిన కాకతీయులు ఆ తర్వాత శైవంలోకి మారినట్లు, గణపతి దేవుడి కాలంలో వేలాది శివాలయాల ప్రతిష్ఠ జరిగినట్లు శాసనాధారాల ద్వారా తెలుస్తోంది. కానీ ఇక్కడ నిర్మించింది వైష్ణవాలయం. కాకతీయుల పరమత సహనానికి ఇదొక ప్రతీకగా నిలుస్తోంది. ఖమ్మం జిల్లాలోని మరో ప్రముఖ చారిత్రక శివాలయం కూసుమంచిలో ఉంది. ఈ ఆలయం కూడా కాకతీయ రాజులు నిర్మించిందే. అయితే ఈ ఆలయాల ప్రాంగణంలో శ్రీకృష్ణుడి ఆలయం ఉంది. ఆ రకంగా ఖమ్మం జిల్లా కాకతీయుల పరమత సహనానికి రెండో ధృఢమైన ఆధారాన్ని అందించినట్లయ్యింది. ప్రతిష్ఠ చేయడాన్ని ‘తిరు’ అంటే పవిత్రమైన ప్రతిష్ఠగా చెప్పడంలో వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించారు. అంతేకాదు గణపతి దేవుడి కాలం నాటి శాసనం రాసిన వైపు దిశలో పై పక్కన ఎడమ వైపుకు తిరిగిన హనుమంతుడు ఉండడమే ఇందుకు నిదర్శనం.

పులిని వేటాడుతున్న వీరగల్లు

పానవట్టం నంది విగ్రహంతోపాటు పులిని వేటాడుతున్న వీరుడి వీరగల్లు కట్టకూరు గ్రామంలో కనిపించింది. పేరంటాళ్లు పేరుతో చెరువు కట్టపై శిథిల శకలాలను ఇప్పటికీ కొలుస్తున్నారు. పెద్దగా ఉన్నరాతి చప్టాలను యంత్రాలతో కదిపి గమనిస్తే శ్రీగోపీనాథ ఆలయం బయటపడే అవకాశం ఉందని గ్రామస్తులు అంటున్నారు. సరిగ్గా పరిశీలిస్తే ఈ చారిత్రక గ్రామంలో మరికొన్ని శాసన చారిత్రక ఆధారాలు దొరకవచ్చనే నమ్మకాన్ని వెలిబుచ్చుతున్నారు.

గణపతి దేవుని రాజ్యాధికారంపై స్పష్టత

గణపతి దేవుని రాజ్యాధికారానికి సంబంధించిన మరో ముఖ్యమైన విషయాన్ని ఈ కట్టకూరు శాసనం తెలియజేస్తోంది. 1199 డిసెంబర్ 26 నాటి మంథెన శాసనం(IAP Kn.28) ప్రకారం గణపతి దేవుడు 1199 నుంచి మాత్రమే అధికారంలో ఉన్నట్లు ప్రముఖ చరిత్రకారుడు పీవీ పరబ్రహ్మశాస్త్రి ‘కాకతీయులు’ అనే పుస్తకంలో అభిప్రాయపడ్డారు. కానీ, ఈ కట్టకూరు శాసనం గణపతి దేవుని అధికార సంవత్సరాన్ని ఒక ఏడాది ముందుకు జరుపుతోంది. ఆయన 1198 ఏప్రిల్ 21 కంటే ముందు నుంచే హన్మకొండ సింహాసనంపై ఉన్నట్లు ఇది నిర్ధారిస్తోంది. యాదవరాజు జైతుగి దగ్గర ఈ కాలంలో బందీగా లేనట్లే అన్నది కూడా అర్థమవుతోంది.

మ్యూజియానికి తరలించాలి

అరుదైన ఈ శిలాశాసనాన్ని ఇప్పుడు పొలాల మధ్య రాళ్లగుట్టల మధ్య వదిలేశారు. ఇది రెండు, మూడు ముక్కలుగా విరిగిపోయింది. పొలాలను బాగు చేసుకుంటూ ట్రాక్టర్లతోనూ, డోజర్లతోనూ తోస్తుండటంతో అనేక అక్షరాలు అర్థం  కాకుండా చెరిగిపోతున్నాయి. గ్రామంలోనే హనుమాన్ ఆలయం లాంటి చోట భద్రపరచడంగానీ, ఖమ్మంలో ఏర్పాటు చేయబోయే మ్యూజియం కోసం వీటిని తరలించడం కానీ చేయడం మంచిది. ఈ శాసనం క్షేత్ర పరిశీలనలో రక్షిత సుమ, సుధాకర్, వీరభద్రి, నిర్మల్ కుమార్, రోషయ్య, తోట నాగేంద్ర, ప్రవీణ్, కొత్తపల్లి శ్రీనివాస్, వెంకటేశ్వర్లు సహకరించారు.

వందేండ్ల లిపి పరిణామక్రమానికి ఆధారం ఈ శాసనం క్రీస్తు శకం1198– క్రీస్తు శకం1303 మధ్య వందేండ్ల కాలంలో కాకతీయుల తెలుగు లిపి పరిణామాన్ని అధ్యయనం చేయడానికి కూడా ఈ శాసనం చక్కటి ఆధారంగా పరిశోధకులకు ఉపయోగపడనుంది. ఈ వందేండ్ల కాలంలో అక్షరాలు ఏమైనా మార్పులకు లోనయ్యాయా? లేక శతాబ్ద కాలం అదే రకంగా ఉన్నాయా? అనే విషయాన్ని ప్రత్యేక పరిశోధనాంశంగా స్వీకరించడానికి లిపి శాస్త్రజ్ఞులకు ఇది తోడ్పడుతుంది. కట్టకూరు గ్రామం ప్రాచీనమైనదనే విషయాన్ని ఈ శాసనం నిర్ధారిస్తుం ది. ఇద్దరి శాసన పాఠాల్లోనూ కట్టకూరు పేరు యథాతథంగా కనిపిస్తోంది. అంటే 820 ఏండ్లకు ముందు నుంచి ఉనికి ఉన్న గ్రామంగా దీన్ని అర్థం చేసుకోవచ్చు.

శాసనం ఉంది.. ఆలయం లేదు

కాకతీయ రాజ్య పతనానికి 20 ఏండ్ల ముందు వీరి దానాలను నిర్ధారిస్తున్న విషయంగా ఈ నమోదుకు మరో ప్రత్యేకత కూడా కనిపిస్తోంది. క్రీస్తు శకం 1303 ఆగస్టు 2(శాలివాహన శకం ప్రకారం శోభకృతు నామ సంవత్సరం 1225  శ్రావణ మాసం శుద్ధ 11వ గురువారం) నాడు శ్రీగోపీనాథ స్వామి నగరి బోగానికై ప్రతాపరుద్రుడు చేసిన దానం వివరాలు రెండో దిశలో పూర్తిగానూ(38 వరుసలు), మూడో దిశలో సగం వరకూ(14 వరుసలు) రాసి ఉంది. ఈ రెండో శాసనంలో కూడా వైష్ణవ సంప్రదాయాన్ని గౌరవించారు. ఒక వైపు కుడివైపు తిరిగి నమస్కార ముద్రలోని గరుడుడు ఉండగా, మరోవైపు విష్ణువు చేతుల్లో ఉండే వైష్ణవ పవిత్ర వస్తువులు శంఖుచక్రం ఉన్నాయి. ఇక చివరిది, నాలుగోది అయిన దిశలో పై భాగాన చంద్రుడు, సూర్యుడి బొమ్మలు ఉన్నాయి. వీటి అర్థం ఆచంద్రార్కం అంటే సూర్య చంద్రులు ఉన్నంత కాలం నిలబడే పని చేస్తున్నాం అని అర్థం. నాలుగోవైపు ఈ బొమ్మలు మినహా మిగిలిన శాసన స్థంభ ప్రదేశం అంతా ఖాళీగా వదిలేశారు. బహుశా గణపతిదేవుని తర్వాత 105 ఏండ్లకు ప్రతాపరుద్రుడు దానం చేసినట్లే.. భవిష్యత్ దానాన్ని ఇక్కడ రాయాలనేది వారి ఉద్దేశం కావొచ్చు. కానీ, ఆ తర్వాత కాకతీయ సామ్రాజ్యం పతనమైన కారణంగా ఇప్పటికీ 820 ఏండ్లు అది అలా ఖాళీగానే ఉండిపోయింది. పైగా ఇప్పుడు ఆ శ్రీగోపీనాథుని ఆలయం కాలగర్భంలో కలిసిపోయింది. కానీ, ఆలయ శకలాలు మాత్రం పొలాల మధ్య, చెరువు కట్ట దగ్గర, గ్రామంలోనూ ఇప్పటికీ కనిపిస్తుంటాయి.

– కట్టా శ్రీనివాస్, చరిత్రకారుడు

For More News..

యూట్యూబ్‌లో చూసి 400 అకౌంట్లు హ్యాక్ చేసిన స్కూల్ డ్రాపౌట్

సర్కారు తీరు మారితేనే మహిళలకు భరోసా

ఫిట్​మెంట్ 43% పైనే ఇయ్యాలి.. తగ్గిస్తే తడాఖా చూపిస్తం..