- ముగ్గురికి తీవ్రగాయాలు, ఇద్దరిపై కేసు
ఎల్లారెడ్డిపేట, వెలుగు : భూవివాదంలో ఇద్దరు వ్యక్తులు ఓ కుటుంబంపై గడ్డపార, కొడవలితో దాడి చేయగా మహిళతో సహా ఇద్దరు కొడుకులకు గాయాలు అయ్యాయి. ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఆదివారం జరిగింది. ఎస్సై రమాకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన గడ్డం ఆనందం 2020లో బండలింగంపల్లి గ్రామ శివారులోని నరసయ్య అనే వ్యక్తి వద్ద 1.08 ఎకరాల భూమిని కొన్నాడు. ఆనందం భార్య పుష్పలత, కొడుకులు కరుణాకర్, జగన్‌తో కలిసి ఆదివారం భూమిని సాగు చేస్తుండగా.. బందుక శ్రీనివాస్, అతడి కొడుకు నరేశ్ కలిసి అడ్డుకున్నారు.
వారు ఎదురు ప్రశ్నించడంతో ఆగ్రహానికి గురైన శ్రీనివాస్, నరేశ్ గడ్డపార, కొడవలితో దాడి చేశారు. ఈ ఘటనలో పుష్పలత, కరుణాకర్, జగన్ తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానిక రైతులు వారిని ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. బాధితుల ఫిర్యాదుతో శ్రీనివాస్, నరేశ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు.