కరెంట్‌‌ షాక్‌‌తో ఇద్దరు మృతి

కరెంట్‌‌ షాక్‌‌తో ఇద్దరు మృతి
  • మెదక్‌‌ జిల్లాలో ఇంటి పక్క నుంచి వెళ్తున్న వైర్లు తగిలి ఒకరు..
  • సిద్దిపేట జిల్లాలో పొలం వద్ద పని చేస్తుండగా షాక్‌‌ కొట్టి రైతు మృతి

శివ్వంపేట, వెలుగు : కరెంట్‌‌ షాక్‌‌తో ఓ వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటన మెదక్‌‌ జిల్లా శివ్వంపేట మండలం చెన్నాపూర్‌‌లో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన సింగిరెడ్డి సుధాకర్‌‌రెడ్డి (45) కొత్త ఇంటిని నిర్మిస్తున్నాడు. గురువారం స్లాబ్‌‌పైకి వెళ్లి పనులను పరిశీలిస్తుండగా అతడి చేయి పక్కనే ఉన్న కరెంట్‌‌ తీగలకు తగిలింది. దీంతో షాక్‌‌ కొట్టి ఫస్ట్‌‌ ఫ్లోర్‌‌ పైనుంచి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ సుధాకర్‌‌రెడ్డి స్పాట్ లో చనిపోయాడు. అయితే ఇంటికి సమీపంలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్‌‌ వైర్లను తొలగించాలని ఆఫీసర్లకు సంవత్సరం నుంచి చెబుతున్నా పట్టించుకోలేదని మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోలనకు దిగారు. విద్యుత్‌‌ ఆఫీసర్ల నిర్లక్ష్యమే కారణమంటూ సుధాకర్‌‌రెడ్డి డెడ్‌‌బాడీతో చిన్న గొట్టిముక్కల – మనోహరాబాద్‌‌ రోడ్డుపై రాస్తారోకో చేశారు. ఘటనకు కారణమైన విద్యుత్‌‌ ఆఫీసర్లను సస్పెండ్‌‌ చేయాలని, మృతుడి కుటుంబ సభ్యులకు పరిహారం చెల్లించాలని డిమాండ్‌‌ చేశారు.  ఎస్ఐ మధుకర్‌‌ రెడ్డి ఘటనాస్థలానికి చేరుకున్నారు. విద్యుత్‌‌ సిబ్బందితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం సుధాకర్‌‌రెడ్డి భార్య మమత ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

తొగుట మండలంలో రైతు..

తొగుట : గడ్డి కోస్తుండగా కరెంట్‌‌ షాక్‌‌ కొట్టడంతో ఓ రైతు చనిపోయాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని ఎల్లారెడ్డిపేట గ్రామంలో గురువారం జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మన్నె లోకేందర్ (38) తనకున్న భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గురువారం ఉదయం గడ్డి కోసేందుకు పొలం వద్దకు వెళ్లాడు. 

పొలం పక్కనే ఉన్న బోరుమోటార్‌‌కు సంబంధించిన వైరు కట్‌‌ అయి కింద నీటిలో పడింది. దీంతో పక్కనే గడ్డి కోస్తున్న లోకేందర్‌‌కు షాక్‌‌ కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఘటనాస్థలానికి చేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి భార్య శైలజ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.