
కూకట్పల్లి, వెలుగు: కేపీహెచ్ బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇద్దరు యువకులు మిస్సయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం.. అబ్దుల్లాపూర్మండలంలోని బాటసింగారానికి చెందిన ఏర్పుల వంశీకృష్ణ, శాలిని దంపతులు. వంశీకృష్ణ అన్న రాధాకృష్ణ స్వగ్రామంలో ఇల్లు నిర్మిస్తున్నాడు.
లోన్ కు సంబంధించిన ఈఎంఐలు కట్టే విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయి. వంశీకృష్ణ నెల రోజులుగా తన భార్యతో కలిసి, కేపీహెచ్‌బీ అడ్డగుట్ట సొసైటీలోని మాదినేని కో–లివింగ్ పీజీ హాస్టల్లో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. రాధాకృష్ణ తరచూ అతనికి ఫోన్‌చేస్తూ ఈఎంఐ కట్టాలని వత్తిడి చేస్తున్నాడు.
గురువారం మధ్యాహ్నం డ్యూటీకి వెళ్తున్నానని భార్యకు చెప్పి వెళ్లిన వంశీకృష్ణ తిరిగి రాలేదు. సాయంత్రం 6.30 గంటలకు ఆమెకు వాట్సాప్ మెసేజ్చేశాడు. తన అన్న ఈఎంఐ కోసం చేస్తున్న ఒత్తిడి తట్టుకోలేక పోతున్నానని, ఎటైనా వెళ్లి, చనిపోవాలనుకుంటున్నానని అందులో పేర్కొన్నాడు. శాలిని శుక్రవారం కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మనీ కోసం బెంగళూరు వెళ్తున్నానని మరొకరు..
కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలోనే మరో యువకుడు మిస్సయ్యాడు. ఏపీలోని బాపట్ల జిల్లా గొల్లపూడికి చెందిన గంద ఉదయభాస్కర్కొంతకాలంగా కేపీహెచ్‌బీ కాలనీ మలేషియా టౌన్షిప్లో ఫ్రెండ్స్‌తో కలిసి ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 16న తన బావ సురేశ్‌బాబుకు ఫోన్ చేసి, మనీ కోసం బెంగళూరు వెళ్తున్నానని, రెండు రోజుల్లో వస్తానని చెప్పాడు. ఆ తర్వాత కాంటాక్ట్‌లో లేకపోవటంతో సురేశ్‌బాబు నగరానికి వచ్చాడు. ఉదయ్‌భాస్కర్ రూమ్మేట్స్ను వాకబు చేస్తే 10 రోజుల నుంచి తమతోనూ కాంటాక్ట్‌లో లేడని చెప్పారు. శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.