- ఛత్తీస్‌గఢ్‌లోని బడేదేపర అడవుల్లో ఘటన
భద్రాచలం, వెలుగు : బీజాపూర్ జిల్లా మద్దేడు పీఎస్ పరిధిలో బడేదేపర అడవుల్లో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. బీజాపూర్ ఎస్పీ జితేంద్రయాదవ్కథనం ప్రకారం.. మావోయిస్టుల కదలికలపై సమాచారం రావడంతో డీఆర్జీ, సీఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్‌కు వెళ్లాయి. బలగాల రాకను గమనించిన మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య కాల్పులు హోరాహోరీగా జరిగాయి. కాల్పులు ఆగిపోయాక చూడగా సంఘటనా స్థలంలో ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలు కనిపించాయి. రూ.8 లక్షల రివార్డు ఉన్న మహిళా మావోయిస్టు లీడర్మనీలాతో పాటు పురుష మావోయిస్టు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
10 మంది లొంగుబాటు
దంతెవాడ ఎస్పీ గౌరవ్రాయ్ ఎదుట బుధవారం 10 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇంద్రావతి ఏరియా కమిటీకి చెందిన వీరు గతంలో అనేక విధ్వంసకర సంఘటనల్లో పాల్గొన్నారు. లచ్చూ పొడియం, రాజేశ్, మంకూ పొడియం, రాంబతి, సుశీల్పొడియం, బామన్మడకం, రానూ కొవ్వాసి, జోగా మడవి, మంగోలీ లొంగిపోయిన వారిలో ఉన్నారు.
మలాంగీర్ ఏరియా కమిటీ కమాండర్ అరెస్ట్
మలాంగీర్ ఏరియా కమిటీ కమాండర్ బార్సే మూయీని సుక్మా జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమెపై రూ.5లక్షల రివార్డు ఉందని, డాక్టర్స్ టీంకు నాయకత్వం వహిస్తున్నారని ఎస్పీ కిరణ్ చౌహాన్ తెలిపారు. మందుపాతర, విప్లవ సాహిత్యం, తుపాకీ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.