- దండకారణ్యంలో ఉద్రిక్త పరిస్థితులు
భద్రాచలం,వెలుగు : మావోయిస్టు పార్టీ వార్షికోత్సవాల వేళ చత్తీస్గడ్ దండకారణ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నారాయణ్పూర్జిల్లా అబూజ్మాఢ్ లో సోమవారం సాయంత్రం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మరణించిన విషయం తెలిసిందే. కొద్ది గంటల వ్యవధిలోనే సుక్మా జిల్లా చింతలనార్ పోలీస్‌స్టేషన్‌పరిధిలోని కర్కన్గూడ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో మరో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు.
మంగళవారం ఉదయం చింతలనార్, ముకరం క్యాంపుల నుంచి డీఆర్ జీ, బస్తర్ ఫైటర్స్, 206 కోబ్రా బలగాలతో సుక్మా ఎస్పీ కిరణ్‌చౌహాన్ ఆధ్వర్యంలో కూంబింగ్ఆపరేషన్ చేపట్టారు. కర్కన్గూడ గ్రామ శివారు చింతవాగు ఒడ్డున గుట్టల్లో మావోయిస్టులు భారీ ఎత్తున మోహరించారు.
దీంతో భద్రతాబలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఇద్దరు మావోయిస్టులు చనిపోగా, మిగిలిన వారు పారిపోయారు. మృతులను జేగురుగొండ ఏరియా కమిటీతో పాటు పీఎల్జీఏ మావోయిస్టులుగా గుర్తించారు. కాల్పుల ఘటనా స్థలంలో భారీగా డంప్‌ను స్వాధీనం చేసుకోగా.. ఆయుధాలు, పేలుడు పదార్థాలు, విప్లవ సాహిత్యం, నిత్యావసరాలు, మందులు ఉన్నాయి. పారిపోయిన మావోయిస్టుల కోసం కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుందని సుక్మా ఎస్పీ కిరణ్ చౌహాన్ తెలిపారు.