పెద్దపల్లి జిల్లాలోని ఎంసీహెచ్లలో సౌకర్యాల కొరత

పెద్దపల్లి జిల్లాలోని ఎంసీహెచ్లలో సౌకర్యాల కొరత
  • డాక్టర్లు, సిబ్బంది లేక గర్భిణులకు ఇబ్బందులు
  • ఇప్పటికీ పూర్తి స్థాయిలో లేని డాక్లర్లు, పరికరాలు
  • నెలలోపే మూతపడిన మంథని ఎంసీహెచ్
  • ఇబ్బందులు పడుతున్న రోగులు, గర్భిణులు

పెద్దపల్లి, వెలుగు: జిల్లాలో రెండు ఎంసీహెచ్ లు ప్రారంభించి ఆరు నెలలు గడిచినా ఇప్పటికీ పూర్తి స్థాయిలో డాక్టర్లు, సిబ్బంది, పరికరాలు అందుబాటులో లేక రోగులు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెద్దపల్లిలో రూ.17 కోట్లతో 100 పడకల ఎంసీహెచ్​ను నిర్మించారు. ఆరు నెలల క్రితం మంత్రి హరీశ్​రావు ఈ ఆస్పత్రిని ప్రారంభించారు. పాత బెడ్స్ 84, కొత్తవి 100తో కలిపి మొత్తంగా 184 పడకలు ఉండగా గైనకాలజిస్టులు ఇద్దరు, నర్సులు 30 మంది మాత్రమే ఉన్నారు. దీంతో వైద్య సేవలు అందించడంతో డాక్టర్లు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంథని కేంద్రంగా ఏర్పాటు చేసిన ఎంసీహెచ్ ప్రారంభించిన నెలలోపే మూసేశారు. భారీ వర్షాలతో ఎంసీహెచ్ పూర్తిగా మునిగిపోయింది. దీంతో పేషెంట్లను పాత ఆస్పత్రికి తరలించి, ఎంసీహెచ్​కు తాళాలు వేశారు. మూడు నెలలైనా మరమ్మతులు చేయలేదు. 

కంప్లీట్​ కాకుండానే..
జల్లాలో కొత్తగా నిర్మించిన హాస్పిటల్స్​, స్కూల్స్, ప్రభుత్వ బిల్డింగులు పూర్తి కాకముందే ఎమ్మెల్యేలు మంత్రులను ఆహ్వానించి ఆర్భాటంగా ప్రారంభోత్సవాలు చేయిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంతోపాటు మంథనిలో నిర్మించిన 100 పడకల ఎంసీహెచ్​ని మంత్రి హరీశ్​రావుతో ఓపెనింగ్​చేయించారు. అనంతరం నిర్వహించిన సభలో వారంలో ఎంసీహెచ్​కు సిబ్బంది, ఎక్విప్​మెంట్లు ఏర్పాటు చేస్తానన్నారు. అయితే ఎంసీహెచ్ ప్రారంభమై ఆరు నెలలైనా ఇప్పటికీ సరిపోయే సిబ్బంది, డాక్టర్లు అందుబాటులో లేరు. 

గర్భిణులకు తప్పని తిప్పలు..
ఎంసీహెచ్ లో అవసరమైన గదులున్నా 6 బెడ్స్ వేయాల్సిన గదుల్లో 10 బెడ్స్ వేసి ట్రీట్​మెంటు ఇస్తున్నారు. గర్భిణులకు అవసరమయ్యే టెస్టులన్నీ ఎంసీహెచ్​లో అందుబాటులోకి రాలేదు. ప్రారంభించే సమయానికి ఎంసీహెచ్ ను కాంట్రాక్టర్ నుంచి జిల్లా వైద్యశాఖ హ్యాండోవర్​ చేసుకోలేదు. అప్పటికి బిల్డింగ్ ఇంటర్నల్ పనులు పూర్తి కాలేదు. ఎలాంటి మెడికల్ ఎక్విప్​మెంట్, సిబ్బంది లేకుండా ఓపెన్​ చేయించడంతో ఆ నాడే మంత్రి హరీశ్​స్థానిక నాయకత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.   

ప్రపోజల్స్ పెట్టాం
అవసరమైన పరికరాలు, డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందికి సంబంధించి ప్రభుత్వానికి ప్రపోజల్స్ పెట్టాం. సిబ్బందిని నియమించుకోవడానికి సర్కార్​ గైడ్​లైన్స్​ ఇచ్చింది. వారం రోజుల్లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి.   
- శ్రీధర్, సూపరింటెండెంట్, పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి