
- బార్ కౌన్సిల్ పాలక మండలికి ఎన్నికలు జరపాలని విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ బార్ కౌన్సిల్ లోని ఇద్దరు సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. హైకోర్టు సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు, మరో న్యాయవాది బీ.శంకర్ బార్ కౌన్సిల్ సభ్యత్వ పదవుల నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొంటూ గురువారం తమ రిజైన్ లెటర్లను బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డికి అందజేశారు. ఇప్పటికే బార్ కౌన్సిల్ పాలక మండలికి ఐదేండ్ల కాలపరిమితి ముగిసి ఏడాది గడిచిపోయిందని, వెంటనే పాలకవర్గానికి ఎన్నికలు నిర్వహించాలని వారిద్దరూ కోరారు.
హైకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని చెప్పారు. తెలంగాణ బార్ కౌన్సిల్‌కు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని గత నెల హైకోర్టు ఆదేశించినప్పటికీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చెప్పలేదు. దీంతో రెండు రోజుల క్రితం తిరిగి జరిగిన హైకోర్టు విచారణ సందర్భంగా జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ నెల 25కి విచారణను వాయిదా వేశారు. ఎన్నికల షెడ్యూల్‌తో విచారణకు అటెండ్ కావాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఆదేశించారు.
ఈ నేపథ్యంలో ఇద్దరు సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. వీలైనంత త్వరగా ఎన్నికలు జరపాలని పట్టుబడుతూ ఇద్దరు సభ్యులు తమ పదవులకు రిజైన్ చేశారు. తెలంగాణ బార్ కౌన్సిల్‌లో మొత్తం సభ్యుల సంఖ్య 25 మంది. వీరిలో 24 మంది సభ్యులుగా ఎన్నికవుతారు. అడ్వకేట్ జనరల్ ఎక్స్ అఫీసియో సభ్యుడిగా ఉంటారు.