అక్కడ చైనా చొరబాటును ఖండిస్తున్నం
అమెరికా సెనేట్‌లో బిల్లు పెట్టిన ఇద్దరు సభ్యులు
వాషింగ్టన్ : ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ ఇండియాలో అంతర్భాగమేనంటూ అమెరికా సెనెట్‌లో ఇద్దరు సభ్యులు బైపార్టిసన్ బిల్లు ప్రవేశపెట్టారు. అరుణాచల్ ఇండియాలో అంతర్భాగమని అమెరికా గుర్తించాలంటూ డెమొక్రటిక్ సెనేటర్ జెఫ్ మెర్కెలే, రిపబ్లికన్ సెనేటర్ బిల్ హగర్టీ దీనిని సభ ముందుకు తెచ్చారు. ఇటీవల సరిహద్దుల వెంబడి ఇండియా, చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బైపార్టిసన్ బిల్లును ఇద్దరు సెనేటర్లు ప్రవేశపెట్టారు.
స్వేచ్ఛ, నైతిక విలువలకే మా ప్రాధాన్యత
‘‘స్వేచ్ఛ, నైతిక విలువలకు అమెరికా అత్యధిక ప్రాధాన్యమిస్తుంది. ప్రపంచ దేశాల మధ్య సత్సంబంధాలు ఉండాలని, అందరూ దానికి అనుగుణంగానే నడుచుకోవాలని ఆకాంక్షిస్తుంది. చైనా ప్రభుత్వం దీన్ని గమనించాలి” అని సెనేటర్ మెర్కెలె చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్ తమదేనన్న ఇండియా వాదనతో ఈ తీర్మానం ఏకీభవిస్తోందని, ఇండియాకు అన్నివిధాలా తోడ్పాటు అందించాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. చైనా చేస్తున్న దురాక్రమణను ఖండిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇండో–అమెరికా మధ్య సంబంధాల బలోపేతానికి ఈ బిల్లు మరింత ఊతమిస్తుందన్నారు. ఈ తీర్మానం సెనెట్ ఆమోదం పొందితే ఇండియా, చైనా మధ్య అంతర్జాతీయ సరిహద్దుగా మెక్‌మోహన్ రేఖను అమెరికా గుర్తించినట్లవుతుంది.
చైనాకు సారీ చెప్పేదిలేదు : బైడెన్
స్పై బెలూన్‌ను కూల్చివేసిన ఘటనపై చైనాకు క్షమాపణలు చెప్పే ఉద్దేశమే లేదని అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ స్పష్టం చేశారు. అయితే.. త్వరలోనే తాను చైనా ప్రెసిడెంట్ జి జిన్ పింగ్‌తో మాట్లాడే అవకాశం ఉందని చెప్పారు. ఇటీవల అమెరికా ఎయిర్‌స్పేస్‌లో చైనా స్పై బెలూన్‌ను అమెరికా ఫైటర్ జెట్లతో కూల్చేసింది. ఆ బెలూన్ నిఘా కోసం ఉద్దేశించినదని అమెరికా, అది క్లైమెట్పై స్టడీ కోసమేనని చైనా ప్రకటించాయి. తమ దేశానికి చెందిన సీక్రెట్ న్యూక్లియర్ వెపన్ సైట్లను గుర్తించేందుకే వీటిని ప్రయోగించినట్టుగా అమెరికా చెబుతోంది.
మూడు వస్తువులపై నో క్లారిటీ
ఇప్పటివరకూ అమెరికా తన ఎయిర్స్పైస్లో 4 గుర్తుతెలియని వస్తువులను కూల్చేసింది. ఒకటి చైనా బెలూన్ కాగా.. మిగతా మూడింటిపై ఇంకా స్పష్టత రాలేదని బైడెన్ చెప్పారు.