
వికారాబాద్, వెలుగు: కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ అమ్ముతున్న ఇద్దరిని వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం వికారాబాద్ పీఎస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ కోటిరెడ్డి వివరాలు వెల్లడించారు. రాజేంద్రనగర్‌లోని ఉప్పర్‌పల్లి ప్రాంతానికి చెందిన బర్కత్ అలీ కొడుకు మన్సూక్(51), అత్తాపూర్‌లోని హ్యాపీ హోం టవర్స్ ప్రాంతానికి చెందిన బికా బాయ్ కొడుకు అజిత్ చరణ్య(35) వీరిద్దరూ కలిసి కొంతకాలంగా వెల్లుల్లి పొట్టు, అజంటాక్స్ టైటానియం డయాక్సైడ్, అజంటాన్ గమ్ యాసిడ్స్ కెమికల్స్‌ను వాడి కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ను తయారు చేసి మార్కెట్లో అమ్ముతున్నారు.
బుధవారం వికారాబాద్ పట్టణంలోని డైమండ్ హోటల్ వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టి.. ఓ ట్రాలీ ఆటోలో తరలిస్తున్న హై ఫైవ్, టేస్టీ కింగ్ టైగర్ పేర్లతో ఉన్న కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ డబ్బాలను గుర్తించారు. మన్సూక్, చరణ్యను అదుపులోకి తీసుకున్నారు. 5 కిలోల అల్లం, వెల్లుల్లి పేస్ట్ డబ్బాను రూ.200కే అమ్ముతున్నట్లు నిందితులు చెప్పారని పోలీసులు పేర్కొన్నారు. నిందితుల నుంచి 11.14 క్వింటాళ్ల కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.