
శామీర్ పేట, వెలుగు: శామీర్‌పేటలోని పొన్నాల చిత్తారమ్మ గుడి దర్శనానికి వచ్చి, అక్కడి చెరువులో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్టకు చెందిన నలుగురు, నాగారం ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు ఆదివారం చిత్తారమ్మ గుడికి వచ్చారు.
అనంతరం చెరువులో ఈతకు వెళ్లారు. ముందుగా పాలసంతుల బాలు(25), సందీప్ సాగర్(27), ఒగ్గు బాలకృష్ణ(24) ఈత కొట్టడానికి చెరువులోకి దిగారు. వీరిలో బాలకృష్ణ క్షేమంగా ఒడ్డుకు చేరుకోగా.. బాలు(25), సందీప్ సాగర్(27) చెరువులో గల్లంత అయ్యారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం శామీర్‌పేట పోలీసులు, ఫైర్ సిబ్బంది, గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చేపట్టారు. రాత్రి కావడంతో గాలింపు చర్యలను నిలిపివేశారు. కేసు నమోదు చేసినట్లు శామీర్ పేట పోలీసులు తెలిపారు.