ఎమ్మెల్యే మైనంపల్లి గెస్ట్ హౌస్​లో ఇద్దరు అడ్డా కూలీలు మృతి

గోడ కూల్చేందుకు వచ్చి కాలు జారి ఒకరు.. 
అది చూసి గుండెపోటుతో మరొకరు..

నవీపేట్, వెలుగు : నిజామాబాద్ ​జిల్లా మండలంలోని జన్నేపల్లిలోని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గెస్ట్ హౌస్ లో పనికి వచ్చిన ఇద్దరు అడ్డాకూలీలు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఎస్సై రాజారెడ్డి కథనం ప్రకారం..మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన కొండపల్లి రాజు(38) ఐదేండ్లుగా నిజామాబాద్​లో అడ్డా కూలీగా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం నిజామాబాద్​ టౌన్​లోని నాగారానికి చెందిన మరొక అడ్డా కూలి  చంపల్​ సాయిలు (29)తో కలిసి మైనంపల్లి ఇంట్లో గోడ కూల్చేందుకు జన్నేపల్లికి వచ్చారు.

మధ్యాహ్నం గోడ ఎక్కిన రాజు కాలుజారి కింద పడిపోయాడు. అప్పటికే కూల్చిన గోడపై పడడంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే చనిపోయాడు. ఇది చూసిన అక్కడే ఉన్న మరో కూలీ గుండె ఆగి మరణించాడు. సంఘటన స్థలానికి మీడియాని గెస్ట్ హౌస్ సిబ్బంది అనుమతించకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. రాత్రి వరకు పోలీసులు కేసు నమోదు చేయలేదు. మృతుడు కొండపల్లి రాజుకు తండ్రి శంకర్, తల్లి లలిత ఉన్నారు.